డైరెక్టర్ గా పీటర్ హెయిన్స్...హీరో ఆయనేనా ?

యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ త్వరలోనే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అదేనండీ డైరెక్టర్ కుర్చీ ఎక్కబోతున్నాడట. ఈ వార్త ఇప్పుడు కాదు రెండేళ్ళ క్రితమే కొద్ది రోజులు హల్చల్ చేసింది. మోహన్‌లాల్ కథానాయకుడిగా నాలుగు దక్షిణాది భాషల్లో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేశారని, త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కనుందని ప్రచారం జరిగింది. దక్షిణాది చిత్రాల్లోని ఎన్నో యాక్షన్ సీక్వెన్స్ లను కొత్త పుంతలు తొక్కించిన పీటర్ హెయిన్స్ మొదటి జాతీయ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకొన్నారు. యాక్షన్ కొరియోగ్రఫీలో జాతీయ పురస్కారాన్ని అందుకొన్న మొట్ట మొదటి ఫైట్ మాస్టర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. మోహన్‌లాల్ నటించిన పులి మురుగన్(మన్యం పులి) సినిమాకి సమకూర్చిన యాక్షన్ సన్నివేశాలకిగానూ పీటర్ కి ఈ జాతీయ పురస్కారం వచ్చింది.
ఆ సినిమా షూటింగ్ టైం లోనే ఆయన మోహన్లాల్కి ఓ కథ చెప్పారని అది ఆయనకి నచ్చిందని ప్రచారం జరిగింది. మరి ఆ సంగతేమో కానీ ఈరోజు ఆయన సినిమా గురించి అఫీషియల్ ప్రకటన వచ్చింది. నిర్మాత నల్లమలుపు బుజ్జి తన సొంత నిర్మాణ సంస్థ అయిన లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ సంస్థలో పీటర్ హెయిన్స్ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించినట్టు ప్రకటించాడు. పీటర్ హెయిన్స్ చెప్పిన కథ వినగానే ఎంతగానో నచ్చేయడంతో బుజ్జి వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కథ టేకాఫ్ అయ్యే విధానం నుంచి ప్రతిదీ ఎక్స్ ట్రార్డినరీగా ఉండనుందని అంటున్నారు. అయితే ముందు నుండీ ప్రచారం జరిగినట్టు మోహన్ లాల్ నటిస్తారా లేక వేరే వారితో తీస్తారా అనేది త్వరలోనే తెలియనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయని అంటున్నారు.