English   

సుజీత్ కు బీహార్ లో గుడి కట్టాలనుకున్నారంట.. సాహోరే.. 

Sujeeth
2019-09-08 17:01:37

సాహో సినిమాతో ఇండియన్ వైడ్ గా పాపులర్ అయ్యాడు కుర్ర దర్శకుడు సుజీత్. ఈ చిత్రం ఫ్లాప్ వైపు అడుగులు వేస్తున్నా కూడా ఈయన మాత్రం తన సినిమాను హిట్ అంటున్నాడు. అర్థం కాకపోతే మళ్లీ చూడండి కానీ మీకు నచ్చినట్లు పదిమందికి చెప్పకండి అంటున్నాడు సుజీత్. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలోనూ చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. చాలా మందికి అర్థం కాకపోవడానికి కూడా కారణం ఇదే అంటున్నాడు సుజీత్. పైగా కాపీ అంటున్నారు కానీ తన సినిమా మాత్రం అస్సలు కాపీ కాదంటున్నాడు ఈయన. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కు ఇది రీమేక్ కాదని.. అసలు ఆ సినిమాకు తన సాహోకు ఏ సంబంధం లేదంటున్నాడు సుజీత్. రివ్యూలతో పనిలేకుండా కలెక్షన్లు మాత్రం తొలివారం బాగానే వచ్చాయి కానీ తర్వాత మాత్రం కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఇప్పుడు సాహో చాలాచోట్ల పడిపోయింది కూడా. అయితే ఇదిలా ఉంటే సినిమాకు టాక్ స్ప్రెడ్ చేసిన వాళ్లకు.. తన సినిమాను కాపీ అంటున్న వాళ్లకు కలిపి సుజీత్ ఒకేసారి సమాధానం ఇచ్చేసాడు. తన తొలి సినిమా రన్ సినిమా పెద్ద హిట్ కాదు.. జస్ట్ సినిమా బాగుందన్నారు.. డబ్బులు కూడా బాగానే వచ్చాయి.. తనకు కూడా మంచి పేరు వచ్చింది.. అప్పుడు అలా కావడానికి ప్రధాన కారణం రివ్యూలు ఇవ్వకపోవడమే అంటున్నాడు సుజీత్. ఇప్పుడు సాహోకు కూడా తొందరపడి రివ్యూలు ఇవ్వకుండా ఉండుంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేదంటున్నాడు. తనకు బీహార్ నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారని.. అక్కడ సినిమా చాలా బాగుందని చెప్తున్నారని అన్నారు. కానీ మన తెలుగు వాళ్లు మాత్రం ఈ సినిమాను పక్కనబడేయడం తట్టుకోలేకపోతున్నానంటున్నాడు సుజీత్. నిజానికి తాను బీహార్ లో పుట్టుంటే అక్కడ తనకు గుడి కట్టేవాళ్లమని బీహార్ ప్రేక్షకులు చెప్తున్నారని సుజీత్ చెప్పడం విశేషం. ఏదేమైనా కూడా సినిమా బాగోలేకపోతే దర్శకుడు ఎవరైనా కూడా ప్రేక్షకులు పట్టించుకోరు. ఆ విషయం సుజీత్ కూడా త్వరగానే అర్థం చేసుకుంటే అది ఆయన కెరీర్ కు కూడా మంచిదంటున్నారు విశ్లేషకులు. 

More Related Stories