English   

విజయ్ దేవరకొండకు కోట్లు కురిపిస్తున్న మీకు మాత్రమే చెప్తా..

 Vijay Devarakonda
2019-09-10 08:07:02

ఈ రోజుల్లో నిర్మాతలకు చాలా కష్టాలు ఉన్నాయని చెబుతుంటారు కొందరు. కానీ ప్లానింగ్ ఉండాలే కానీ అక్కడున్నన్ని డబ్బులు కూడా మరెక్కడా లేవు. ఇప్పుడు ఈ కిటుకు తెలుసుకుని నిర్మాణంలోకి దిగాడు విజయ్ దేవరకొండ. తన ఇమేజ్ పనంగా పెట్టి మీకు మాత్రమే చెప్తా అంటూ పూర్తిస్థాయి నిర్మాతగా మారిపోయాడు. పెళ్ళి చూపులు సినిమాతో లైఫ్ ఇచ్చిన డైరక్టర్ తరుణ్ భాస్కర్ కు ఇప్పుడు హీరోగా తను లైఫ్ ఇస్తున్నాడు విజయ్. 'మీకు మాత్రమే చెప్తా' అంటూ వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి. టీజర్ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్ అని నమ్మకానికి వచ్చేసారు అభిమానులు. ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుదలకు ముందే విజయ్ దేవరకొండకు లాభాల పంట పండిస్తుంది. ఈ సినిమాను నైజాం స్టార్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ రెండున్నర కోట్లుకు తీసుకున్నారని తెలుస్తుంది. దీని బడ్జెట్ కూడా అంతే కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర హక్కులను తీసుకుంటున్నాడు సునీల్ నారంగ్. అయితే తెలివిగా నాన్ థియేట్రికల్ హక్కులు అంటే శాటిలైట్, డిజిటల్ మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు విజయ్ దేవరకొండ. తనకున్న మార్కెట్ దృష్ట్యా ఇవన్నీ కలిపి దాదాపు 5-6 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాడు విజయ్. ఇందులో హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా ఉన్నాయి. ఎలా చూసుకున్నా కూడా ఈ సినిమాతో దాదాపు 5 కోట్లకు పైగా లాభాలు అందుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్లానింగ్ చేసుకుని సినిమాలు చేస్తే.. ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా లాభాలు ఖాయం అనేది విజయ్ మరోసారి ప్రూవ్ చేసాడంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. గతేడాది నాని కూడా అ.. సినిమాతో ఇదే చేసాడు. ఇప్పుడు విజయ్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడు. అక్టోబర్ లో మీకు మాత్రమే చెప్తా విడుదల కానుంది. అనసూయ భరద్వాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.


 

More Related Stories