English   

పవన్ కల్యాణ్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్..

 Bandla Ganesh
2019-09-12 18:18:49

బండ్ల గణేష్.. ఈయన పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా కావాల్సినంత కామెడీ చేసాడు ఈయన. గణేష్ 7 క్లాక్ బ్లేడ్ జోక్ ఇప్పటికీ సంచలనమే. ఆ మధ్య ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్ని రోజుల పాటు హడావిడి చేసాడు ఈయన. పార్టీ ఓడిపోగానే పత్తా లేకుండా పోయాడు బండ్ల. ఇక ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్లీ తెరపై కనిపించాడు గణేష్. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులపై గణేష్ నోరు విప్పాడు. మరీ ముఖ్యంగా పల్నాడు అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు బండ్ల గణేష్. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిందంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పటికే చాలాసార్లు చచ్చాము మనం.. మద్రాస్.. కర్నూల్.. హైదరాబాద్ అని వేధింపులకు గురయ్యాము కదా.. ఇప్పుడు పోలవరాన్ని, అమరావతిని అటకెక్కించారని దుయ్యబట్టాడు గణేష్. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈయన. ఇప్పట్లో ఇంకో ఎన్నికలు లేవని వైసీపీ, టీడీపీ ఎప్పుడు తెలుసుకుంటారని కౌంటర్ వేసాడు. కక్ష్య సాధింపులతో పరువు బజారుకెక్కడం తప్ప ఇంకేం జరగదని ఆయన హితవు పలికారు. పాలనలోకి వచ్చిన 100 రోజుల తర్వాత కూడా ఏం చేయని జగన్ ఇప్పటికైనా నిద్ర లేస్తే బాగుంటుందని సూచించాడు గణేష్. ఏ జండాలేని, ఎజెండా లేని నాయకులు కూడా కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే మంచిదంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొన్ని రోజులు కూడా ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ రెచ్చిపోయాడు. దగా పడ్డ తెలుగు ప్రజలారా మీరు ఏ నాయకుణ్ణి నమ్మొద్దు. మీకు సహాయం చేసే స్థితిలో నేను లేను. మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలి. భావితరాలకు ఆయనే దిక్కు అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను కూడా ఆయన టార్గెట్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారిపోయింది.

More Related Stories