English   

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దిక్కంటున్న సీనియర్ నటుడు..

jrntr
2019-09-13 20:59:46

తెలుగుదేశంకు ఇప్పుడు పునర్వైభవం రావాలంటే అందరి చూపు ఇప్పుడున్నది జూనియర్ ఎన్టీఆర్ పైనే. ఆయన వస్తే కానీ పార్టీకి మళ్లీ మంచి రోజులు రావంటున్నారు అంతా. ఇప్పుడు సీనియర్ నటుడు గిరిబాబు కూడా ఇదే అంటున్నాడు. తాజాగా ఈయన ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని కూడా బయటపెట్టాడు గిరిబాబు. దాంతో పాటు బాలకృష్ణ గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఈ నటుడు. ముందుగా ఈ ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఆయన లాంటి గొప్ప నటుడు మళ్లీ పుట్టడని చెప్పాడు. ఇక చివరి రోజుల్లో ఎన్టీఆర్ దుస్థితికి కారణం మాత్రం దురదృష్టం అని చెప్పాడు గిరిబాబు. కేవలం పార్టీ సభ్యులం కాబట్టి అప్పుడు ఆయన పరిస్థితి చూస్తూ ఉండిపోవడం తప్ప ఇంకేం చేయలేకపోయామని చెప్పాడు ఈయన. అప్పుడు ఆయన కర్మ అలా రాసిపెట్టుంది అంటున్నాడు ఈయన. ఇక బాలయ్య గురించి చెప్తూ తనను అన్నయ్య అని పలిచేవాడని.. సెట్లో కోపం వస్తే అందర్నీ కొడతాడు బాలయ్య అనేది మాత్రం అబద్ధం అంటున్నాడు గిరిబాబు. విసిగిస్తే ఎవరికైనా కోపం వస్తుంది.. బాలయ్యది కూడా అలాంటి కోపమే అంటున్నాడు ఈయన. ఇక తన రాజకీయ జీవితం గురించి చెప్తూ.. ఎన్టీఆర్ వెళ్లిపోవడంతోనే తాను కూడా తెలుగుదేశం నుంచి బయటికి వచ్చేసానంటున్నాడు.

2009లోనే తాను రాజశేఖర్ రెడ్డి వైపు వచ్చానని.. ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నట్లు తెలిపాడు గిరిబాబు. ప్రజల కష్టాలను తెలుసుకోవడంలో జగన్ ముందున్నాడంటున్నాడు ఈయన. రామారావుగారి తర్వాత వైఎస్ఆర్, ఇప్పుడు మళ్లీ జగన్ ఆ స్థాయి నాయకులు అంటున్నాడు. మరో 15 ఏళ్ళ పాటు ఆయనే వస్తాడంటున్నాడు గిరిబాబు. ఇక తెలుగుదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో బతికి బట్టకట్టాలంటే వాళ్ల ముందున్న లక్ష్యం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అంటున్నాడు ఈయన. అతడిని కానీ పార్టీలోకి తీసుకురాకపోతే జనం అంతా కలిసి తెలుగుదేశం నాయకులను బయటకు పంపుతారంటే సంచలన వ్యాఖ్యలు చేసాడు గిరిబాబు. మొత్తానికి జూనియర్ రాజకీయ అరంగేట్రం గురించి బాగానే చర్చ నడుస్తుంది. మరి దీనిపై ఈయనేం అంటాడో చూడాలి.

More Related Stories