English   

సీనియర్ నటి లక్ష్మీ సంచలనం.. గ్యాంగ్ లీడర్ లో పాత్రకు ప్రశంసలు..

lakshmi
2019-09-14 06:26:54

60 ఏళ్లు దాటిన తర్వాత కూడా హీరోలు సినిమాలు చేస్తుంటారు. అప్పటికి వాళ్లకు స్టార్ ఇమేజ్ ఉంటుంది. ర‌జినీకాంత్, చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్ లాంటి వాళ్లు ఇప్ప‌టికీ సినిమాలు చేస్తున్నారు. కానీ హీరోయిన్ల విషయంలో అలా ఉండదు. వాళ్లకు 30 దాటితేనే అవ‌కాశాలు రావు. క‌నీసం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారాలన్నా కూడా కాస్తో కూస్తో వయసుండాలి. 60 దాటితే ఇంట్లో కూర్చోబెట్టేస్తారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇప్పుడు ఒక న‌టి మాత్రం 66 ఏళ్ల వయసులో వరుస సినిమాలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమాతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి లక్ష్మి.. 66 ఏళ్లు వచ్చిన తర్వాత మూడో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అందుకు తగ్గట్లే ఈమెకు ఈ వయసులో కూడా వరస అవకాశాలు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య సమంత అక్కినేని నటించిన ఓ బేబీ సినిమాలో బామ్మగా నటించింది లక్ష్మినే. ఈ పాత్రకు ఆమె మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక మొన్న విడుదలైన నాగార్జున మన్మధుడు 2తో కూడా కీలక పాత్రలో నటించింది లక్ష్మి. ఇక ఇప్పుడు నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా లక్ష్మి కీలక పాత్రలో నటించారు. ఇందులో కథకు మూలం ఈమె. ఈ చిత్ర కథ ఐదుగురు ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతుంది. అందులో బామ్మ పాత్రలో లక్ష్మీ కనిపించింది. ఇదే కాదు మరికొన్ని సినిమాల్లో కూడా లక్ష్మి కీలక పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది. చాలా రోజుల తర్వాత ఈ సీనియ‌ర్ న‌టిని వరస సినిమాల్లో చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.

More Related Stories