మళ్ళీ హ్యాట్రిక్ కాంబినేషన్ కి రంగం సిద్దం

ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎన్నికల బిజీ వలన దాదాపు ఆరేడు నెలలు సినిమాలకు దూరమైపోయారు. ఇటీవలే కేఎస్ రవికుమార్ సినిమాను పట్టాలెక్కించారు. థాయిలాండ్ లో ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసి మరో షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. అయితే ముందు నుండీ చెబుతున్నట్టుగా కాక కేఎస్ రవికుమార్ కు ఛాన్స్ ఇవ్వడంతో బోయపాటితో బాలయ్య సినిమా ఉండదని అందరూ అనుకున్నారు. అయితే బోయపాటితో కూడా బాలయ్య సినిమా ఉంటుందని ఈరోజు తేల్చారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుందని అంటున్నారు. త్వరత్వరగా షూట్ పూర్తి చేసుకుని 2020 వేసవిలో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. రవికుమార్ సినిమాలో బాలయ్య కొత్త గెటప్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. బోయపాటి సినిమా కోసం బాలయ్య మరింత బరువు తగ్గబోతున్నారని అంటున్నారు.