అసలు ఎవరీ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి.. ఆయన కథేంటి..

చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్లవుతుంది. ఈ సమయంలో ఎన్నో వందలాది సినిమాల్లో నటించారాయన. రీ ఎంట్రీ కూడా ఇచ్చి ఖైదీ నంబర్ 150లో రప్ఫాడించాడు. ఇదిలా ఉంటే ఎన్నో కారెక్టర్లు చేసిన ఆయన.. ఎప్పుడూ ఓ పాత్రపై మాత్రం ప్రత్యేకమైన మోజు చూపించాడు. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఓ రకంగా చిరుకు అది డ్రీమ్ రోల్ కూడా. ఈ పాత్రపై ఇప్పుడు కాదు.. పదేళ్ల కింద ఆయన సినిమాలతో బిజీగా ఉన్నపుడే ఆసక్తిగా ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఉయ్యాలవాడ చరిత్ర మరుగున పడింది. మళ్లీ ఇప్పుడు ఆయన సినిమాల్లోకి రావడంతో.. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా పట్టాలెక్కింది. అక్టోబర్ 2న విడుదల కానుంది కూడా.
అసలు ఉయ్యాలవాడ ఎవరంటే.. ఇండియాలో తొలి స్వాతంత్ర్య తిరుగుబాటు 1857లో మొదలైంది. కానీ అంతకు పదేళ్ల ముందే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన వీరమరణంతో ముగిసింది. ఈ 8 నెలల కాలంలో బ్రిటీష్ వారిని ముప్పుతిప్పలు పెట్టి.. మూడు కాదు ముప్పై చెరువుల నీరు తాగించాడు నరసింహారెడ్డి. ఆ రోజుల్లోనే ఈయన్ని పట్టుకుంటే 5000 రూపాయలు.. చంపిన వారికి 10 వేల రూపాయల నజరానా ప్రకటించింది బ్రిటీష్ ప్రభుత్వం. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1847, ఫిబ్రవరిలో బహిరంగంగా ఉరి తీయబడ్డాడు.
కర్నూల్ జిల్లాలోని ఓ పాలెగాడు ఉయ్యాలవాడ. ఓ రోజు తనకు రావాల్సిన భరణాన్ని తీసుకురావాల్సిందిగా తన బంటును తహసిల్దరు దగ్గరికి పంపిస్తే.. ముష్టోడికి మరో ముష్టోడు డబ్బులు అడుక్కోడానికి వస్తాడా అంటూ బంటు తల నరికి గుర్రంపై వెనక్కి పంపిస్తారు. అక్కడ్నుంచి ఉయ్యాలవాడ ఉగ్రరూపం దాల్చుతాడు. వచ్చి తహసిల్దారును చంపడం.. ఖజానాను కొల్లగొట్టడం.. ఆ తర్వాత మాటువేసి బ్రిటీష్ అధికారులను నరికేయడం చేసాడు ఉయ్యాలవాడ. ఆయన పేరు వింటేనే బ్రిటీష్ వాళ్ళకు ఉచ్ఛ పడిపోయేదంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం 6 నెలల వ్యవధిలోనే 8 యుద్ధాలు చేసాడు ఉయ్యాలవాడ. అలాంటి వీరుడి కథ కావడంతో చిరంజీవి ఎప్పుడూ ఈ కథపై ఆసక్తి చూపించాడు. ఇప్పటికి అది కుదిరింది.. మరి ఈ సినిమా ఏం మాయ చేస్తుందో చూడాలిక.