వాల్మీకి ప్రివ్యూ.. వరుణ్ తేజ్ టార్గెట్ ఎంతో తెలుసా..

వరుణ్ తేజ్ అంటే ఇప్పటి వరకు అందంగా.. గ్లామర్ గా కనిపించాడు. ఎఫ్ 2 లాంటి సినిమాల్లో అయితే అమ్మాయిలు ఈయన్ని చూసి ఫిదా అయిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం వాల్మీకిలో మాత్రం గద్దలకొండ గణేష్ అంటూ రచ్చ చేస్తున్నాడు. ఇందులో వరుణ్ తేజ్ ను చూసి భయపడతారంతా. అంతగా ఈ చిత్రం కోసం మారిపోయాడు మెగా వారసుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. ముఖ్యంగా డైలాగ్ డెలవరీలో కూడా పిచ్చెక్కించాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 19 కోట్లకు పైగా అమ్మేసారు 14 రీల్స్ సంస్థ. పైగా తమిళనాట భారీ విజయం సాధించిన జిగర్తాండ సినిమా రీమేక్ కావడంతో ఆసక్తి పెరిగిపోతుంది. ఇందులో నెగిటివ్ కారెక్టర్ చేసాడు వరుణ్ తేజ్. అక్కడ బాబీ సింహా చేసిన పాత్ర ఇది. అక్కడి కంటే ఇక్కడ మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేసాడు హరీష్ శంకర్. కచ్చితంగా ఈ చిత్రంతో మరోసారి వరుణ్ సంచలనం రేపడం ఖాయం అంటున్నారు అభిమానులు. పైగా గబ్బర్ సింగ్ సినిమాను కూడా రీమేక్ మాదిరి కాకుండా సొంత సినిమాలా తెరకెక్కించాడు హరీష్. ఇప్పుడు వాల్మీకి విషయంలో కూడా ఇదే జరుగుతుందని నమ్ముతున్నాడు ఈయన. బాబీ సింహా పాత్రలో వరుణ్ నటిస్తే.. సిద్ధార్థ్ పాత్రలో తమిళ హీరో అథర్వ మురళి నటించాడు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. పైగా మెగా హీరోలకు హరీష్ శంకర్ బాగానే కలిసొచ్చాడు. డీజే, సుబ్రమణ్యం ఫర్ సేల్, గబ్బర్ సింగ్ తర్వాత మెగా కంపౌండ్ హీరోతో హరీష్ చేస్తున్న సినిమా ఇది.