English   

సైరా నరసింహా రెడ్డి కోసం కదిలొస్తున్న సల్మాన్ ఖాన్..

Salman Khan
2019-09-19 20:54:49

సైరా నరసింహా రెడ్డి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగులో చిరంజీవి ఉన్నాడు కాబట్టి ఎలాంటి ప్రమోషన్ అవసరం లేదు. ఇప్పటికే సైరాపై అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కానీ హిందీలో మాత్రం ఈ సినిమాకు అంత క్రేజ్ లేదు. దాంతో అక్కడ స్టార్ హీరోలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సెప్టెంబర్ 18న జరపాలనుకున్నారు. కానీ అనుకోకుండా భారీ వర్షాలతో ఈ వేడుక 22కి మారింది. ఆ తర్వాత 25న చెన్నైలో.. 27 బెంగళూరులో.. 29న కేరళలో.. 30న ముంబైలో ఈ సినిమా వేడుకలను ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అక్టోబర్ 2న విడుదల కాబట్టి ఆ లోపు అన్ని ఇండస్ట్రీలు కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు రామ్ చరణ్. బాలీవుడ్ లో అదే రోజు హృతిక్ రోషన్,టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' సినిమా విడుదల కానుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. అయినా కూడా ధైర్యంగా సైరా సినిమాను విడుదల చేస్తున్నాడు నిర్మాత చరణ్. బాలీవుడ్‌లో సైరా వర్సెస్ వార్ మధ్య పోటీ బాగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు సైరా కోసం సల్మాన్ ఖాన్ దిగుతున్నాడు. చిరంజీవి సినిమాకు కండల వీరుడు ప్రమోషన్ చేయబోతున్నాడని తెలుస్తుంది. చరణ్‌తో సల్మాన్ ఖాన్‌కు ఉన్న రిలేషన్ కారణంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆయన కూడా వస్తాడని చెబుతున్నారు. దానికితోడు అమితాబ్ బచ్చన్ కూడా సినిమాలో ఉన్నాడు. మొత్తానికి సైరాను ఎలాగోలా నేషనల్ ప్రాజెక్ట్ చేయాలని చాలా కలలు కంటున్నాడు రామ్ చరణ్.

More Related Stories