దుల్కర్ సల్మాన్ కి జోడీగా గూడచారి భామ

తెలుగింటి ఆడపడుచు శోభితా ధూళిపాళ ప్రతిభ కేవలం టాలివుడ్ కే పరిమితం కాలేదు. అటు వెబ్ సిరీస్, బాలివుడ్ సినిమాలు, యాడ్ ఫిల్మ్‌లలో తన ప్రతిభను చాటుకుంటూ బాలీవుడ్ దాకా చేరింది. గూఢచారి సినిమాలో తళుక్కున మెరిసిన ఈ భామ 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఇక శోభిత ప్రస్తుతం సినిమాలతో.. వెబ్ సీరీస్ లతో బిజీగా ఉంది. నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్న మలయాళ-హిందీ ద్విభాషా చిత్రం 'మూతోన్' లో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె మరో మలయాళ సినిమా ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
దుల్కర్ సల్మాన్ ఓ పెద్ద క్రిమినల్‌గా నటిస్తున్న సినిమాలో ఆయనకు జంటగా శోభితా ధూళిపాళని క్యాస్ట్ చేశారు. ఈ మలయాళ సినిమా పేరు 'కురుప్' అనుకుంటున్నారు. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్ సుకుమార కురుప్. అతని జీవితం ఆధారంగా 'కురుప్' తెరకెక్కుతోంది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుకుమార కురుప్ పాత్రలో దుల్కర్ నటించడమే కాక ఈ సినిమా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభం అయిందని అంటున్నారు. ఇక శోభిత నివీన్ పౌలీతో చేసిన 'మూతాన్' రిలీజ్‌కు రెడీ అయింది. చూడాలి ఈ భామ మళయాళ ఇండస్ట్రీలో అయినా నిలబడుతుందో లేదో అని ?