English   

బందోబస్త్ రివ్యూ

Bandobast Review
2019-09-20 17:47:53

సూర్య సినిమాలకు ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది.. కానీ ఇప్పుడు కాదు. మళ్లీ తన మార్కెట్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు సూర్య. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు చేసిన బందోబస్త్.. మరి అది ఎలా ఉంది.. ప్రేక్షకులను మెప్పిస్తుందా..?

కథ:

భారతదేశ ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) మంచి నాయకుడు. ఆయనకు ముందు జనం.. తర్వాతే కుటుంబం. అలాంటి నాయకున్ని తమ స్వార్థం కోసం చంపాలని ప్లాన్ చేస్తారు కొందరు పాకిస్తాన్ టెర్రరిస్టులు. వాళ్లతో మన దేశద్రోహులు కూడా చేతులు కలుపుతారు. అందుకే ఆయనకు ఎప్పుడూ రక్షణగా ఉండటానికి ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా రవి కిషోర్ (సూర్య) వస్తాడు. ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు ఇంటిలిజెన్స్‌లో పని చేస్తుంటాడు రవి. తన ధైర్య సాహసాలతో ప్రధానిని ఓ సారి కాపాడతాడు. అలా ఆయనకు మరింత దగ్గరవుతాడు రవికిషోర్. ఆ క్రమంలోనే అక్కడే పని చేసే అంజలి (సయేషా సైగల్)తో ప్రేమలో పడతాడు రవి కిషోర్. కానీ తర్వాత కొన్ని అనుకోని సంఘటనలతో ప్రధాని వర్మను శత్రువులు చంపేస్తారు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అప్పుడే అనుభవం లేని జూనియర్ వర్మ (ఆర్య) తెరపైకి వస్తాడు. ప్రధాని అవుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ..

కథనం:

ఒకప్పుడు సూర్య సినిమా అంటే ఏదో తెలియని ఆసక్తి ఉండేది.. కానీ మెల్లగా తన రొటీన్ కథలతో అది పోగొట్టుకునే స్టేజ్‌కు వచ్చేసాడు.. నిజానికి బందోబస్త్ సినిమాకు కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైంది. అదే కారణం కావచ్చు.. ఈ సినిమా పర్లేదు అనిపిస్తుంది ఆడియన్స్ కు. సూర్య ఈ మధ్య చేసిన సినిమాల్లో ఇది కాస్త బెటర్ మూవీ అనిపిస్తుంది ఇది. ముఖ్యంగా కేవీ ఆనంద్ తీసుకున్న కథ కంటే కూడా స్క్రీన్ ప్లే బాగుంది.. అదే టెర్రరిజం బ్యాక్ డ్రాప్.. పాకిస్తాన్‌ను టార్గెట్ చేయడం.. దేశద్రోహం కథే..తెలిసిన కథే అయినా కూడా కథనంలో ఆనంద్ దర్శకత్వ ప్రతిభ కనిపించింది. ఫస్టాఫ్ అయితే పకడ్బందీ స్క్రీన్ ప్లేతో బాగుంది.. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది.. సెకండాఫ్ కూడా అదే స్పీడ్‌తో వెళ్ళుంటే బందోబస్త్ రేంజ్ మరోలా ఉండేది.. కానీ అలా జరగలేదు.. అక్కడక్కడా పడుతూ లేస్తూ సినిమా ముందుకెళ్లింది.. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు బాగున్నాయి.. పాటలు మాత్రం కథకు చాలా అడ్డుపడ్డాయి.. రంగం, వీడొక్కడే రేంజ్ కేవీ ఆనంద్ సినిమా అయితే ఇది కాకపోవచ్చు.. కానీ కచ్చితంగా కాస్త మెసేజ్.. కాస్త యాక్షన్ ఉన్న సగటు మాస్ సినిమా బందోబస్త్.. సూర్య ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు.. ఆయన నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు.. మోహన్ లాల్ కూడా తన పాత్రలో మెప్పించాడు.. కానీ ఆయన పాత్రలో మోదీ ఛాయలు కనిపించాయి..  ఆర్య, సయేషా సైగల్ తమ తమ పాత్రల్లో బాగున్నారు.. ఓవరాల్‌గా బందోబస్త్.. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే పర్లేదు అనిపిస్తుంది..

నటీనటులు:

సూర్య తన పాత్రకు ప్రాణం పోసాడు. ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా బాగున్నాడు. ఫిజిక్ కూడా అదిరిపోయింది. మోహన్ లాల్ తన పాత్రలో బాగా నటించాడు. ప్రధాని పాత్రలో హూందాగా ఉన్నాడు. ఆర్య కూడా బాగున్నాడు. బాగానే నటించాడు కూడా. సయేషా సైగల్ జస్ట్ ఓకే అనిపించింది. సముద్రఖని తన పాత్రకు ప్రాణం పోసాడు.. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

హరీష్ జైరాజ్ సంగీతం అస్సలు ఆకట్టుకోలేదు. ఒక్కపాట కూడా లిరిక్స్ అర్థం కాలేదు. ఆర్ఆర్ కూడా అంతంతమాత్రమే. ఎడిటర్ చాలా చోట్ల మిస్ ఫైర్ చేసాడేమో అనిపించింది. చాలా సన్నివేశాలు ల్యాగ్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ ఓకే. దర్శకుడిగా కేవీ ఆనంద్ పెద్దగా ఆకట్టుకోలేదు ఈ సారి. కథనం బాగున్నా.. కథ దగ్గర అసలుకే మోసం వచ్చేసింది. రంగం, వీడొక్కడే దృష్టిలో ఉన్న వాళ్లకు ఈ సినిమా రుచించడం కష్టమే.

చివరగా: బందోబస్త్.. సూర్య కోరుకున్న సినిమా కాదు..

రేటింగ్ : 3/5

More Related Stories