హాలీవుడ్ ఎంట్రీకి సిద్దమయిన రెహమాన్ మేనల్లుడు

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ రెహ్మాన్ వారసుడిగా ఇప్పటికే సంగీత దర్శకుడిగా, హీరోగా రాణిస్తున్నాడు. తమిళ ‘డార్లింగ్'తో హీరోగా కెరీర్ ప్రారంభించిన ప్రకాశ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటుతున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన ‘నాచియార్' ‘సర్వం తాళమయం’ నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఆయన నటించిన 100 % కాదల్ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇక తాజాగా ఆయన హాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నారనే వార్తలు తమిళ మీడియాలో హల్చల్ చేస్తోంది. ట్రాప్సిటీ పేరుతో రూపొందించనున్న సినిమాలో జీవీ ప్రకాష్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు అక్కడి మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి.
రికీ బర్చెల్స్ దర్శకుడిగా యాక్షన్ ప్రధాన జోనర్ గా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. ఈ సినిమాని కైబా అనే హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థపై టెల్ గణేశన్ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు నెపోలియన్ ప్రధాన పాత్రలో నటించిన వెవిల్స్ నైట్, క్రిస్మస్ కూపన్ వంటి హాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం జీవీ ప్రకాష్ ‘అసురన్' ‘సురారైపొట్రు’ వంటి భారీ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో కోలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ధనుష్, నెపోలియన్ లాంటి అతి కొద్ది మంది నటుల సరసన జీవీ చేరనున్నాడు.