English   

నేడు వేణుమాధవ్ అంత్యక్రియలు...కాసేపట్లో ఫిలిం చాంబర్ కి 

 Venu Madhav
2019-09-26 12:34:08

తెలుగు సినీ జగత్తులో హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న వేణుమాధవ్ అనారోగ్యంతో బుధవారం హైదరాబాద్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారాయన. అయితే ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. 

ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో మంగళవారం ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమంగా తయారై, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 12:21 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య శ్రీవాణి, కొడుకులు మాధవ్‌ సావికర్, మాధవ్‌ ప్రభాకర్‌ ఉన్నారు. అయితే నిన్న వేణు మాధవ్‌ మృతదేహాన్ని కాప్రా హెచ్‌పీ కాలనీలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. 

అయితే ఈరోజు అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్‌ పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30గంటల వరకూ ఫిల్మ్‌నగర్‌లోని ‘ఫిలిం చాంబర్’ ఆఫీస్ ఆవరణలో ఉంచనున్నారు. అనంతరం వేణు మాధవ్ పార్థివదేహాన్ని బన్సీలాల్‌ పేటకు తరలించి, అక్కడి స్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 


 

More Related Stories