ఎఫ్ఎన్సీసీ ఎన్నికల్లో కేఎల్ నారాయణ ప్యానెల్ విజయం

హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో కేఎల్ నారాయణ ప్యానెల్ ఘన విజయం సాధించింది. కానీ కేఎల్ నారాయణ ప్యానెల్ నుండి పోటీ చేసిన ప్రధాన కార్యదర్శి అభ్యర్థి మాత్రం ఓటమిపాలయ్యారు. అధ్యక్షుడిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ప్రధాన కార్యదర్శిగా నిర్మాత కేఎస్ రామారావు ఎన్నికయ్యారు. 668 ఓట్ల ఆధిక్యంతో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గెలుపొందారు. ముళ్లపూడి మోహన్ మీద 15 ఓట్ల ఆధిక్యంతో రామారావు ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా మునుపెన్నడూ లేనంత భారీ మెజారిటీ(541 ఓట్ల)తో మా మాజీ అధ్యక్ష్యుడు శివాజీ రాజా ఎన్నికయ్యారు.
ట్రెజరర్ గా తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీగా సదా శివరెడ్డి, ట్రెజరర్‌గా తుమ్మల రంగారావు, పర్మినెంట్ కేటగిరీ ఈసీ మెంబర్లుగా డి.వి.రామకృష్ణ ప్రసాద్, ఏడిద సతీశ్, విజయ్‌కుమార్‌రావు, వి.వి.గోపాలకృష్ణంరాజు, ప్రమోటర్ కేటగిరీ ఈసీ మెంబర్లుగా జె.బాలరాజు, కె.మురళీమోహన్రావు, పి.నాగ సుష్మ, శైలజా, కాజా సూర్యనారాయణలు ఎంపికయ్యారు. కార్యదర్శిగా ఎంపికైన కేఎస్ రామారావు తప్ప గెలుపొందిన వారిలో మిగిలినవారందరూ కె.ఎల్.నారాయణ ప్యానల్‌కు చెందినవారే కావడం గమనార్హం.