English   

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పై పరుచూరి గోపాలకృష్ణ సవాల్..

Uyyalawada Narasimha Reddy
2019-09-30 14:54:41

సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే రోజుకో విధంగా ఈ సినిమా వివాదంలో నిలుస్తుండటం అభిమానులను కలవర పెడుతోంది. ముఖ్యంగా భారత దేశ తొలి స్వతంత్ర సమరయోధుడి జీవిత కథ అంటూ ముందు నుంచి దర్శక నిర్మాతలు ఈ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు చరిత్రకారులు మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కంటే ముందు కూడా కొందరు భారత దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై పోరాడారు అంటూ చెబుతున్నారు.

కానీ దీనిపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ అసలు ఒప్పుకోవడం లేదు. అలా ఎవరైనా నిరూపిస్తే వాళ్లు చెప్పింది నేను చేస్తాను అంటూ సవాల్ విసురుతున్నాడు పరుచూరి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ సిద్ధం చేసింది పరుచూరి బ్రదర్స్. దానికి చిరంజీవి అయితే సరిగ్గా సరిపోతుందని 15 ఏళ్ల కిందట ఈ కథను ఆయనకు వినిపించారు. అప్పట్లో బడ్జెట్ సహకరించక అది ఇప్పుడు తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్రం కోసం పోరాడిన తొలి యోధుడు అని మనం చెప్పుకుంటున్నాం.. కానీ ఆయనకన్నా ముందుగా వీరపాండ్య కట్టబ్రహ్మణ లాంటి వారు స్వాతంత్రం కోసం పోరాడారని కొందరు అంటున్నారు.. అది ఏ మాత్రం కరెక్ట్ కాదు.. తెలిసీ తెలియని సమాచారం ఇవ్వడానికి తానేమి తెలివి తక్కువ వాళ్ళు కాదు అంటున్నాడు గోపాలకృష్ణ. 

ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోండని పోరాటం చేసిన మొదటి యోధుడు ఉయ్యాలవాడ. వీరపాండ్య కట్టబ్రహ్మణ తన రాజ్యాన్ని రక్షించుకునేందుకు మాత్రమే బ్రిటిష్ వారితో పోరాడాడని చెబుతున్నాడు పరచూరి గోపాలకృష్ణ. ఆయన పోరాటం స్వాతంత్రం కోసం కాదు.. కేవలం తన సొంత రాజ్యం కోసమే అని పరుచూరి అన్నారు. కట్టబ్రహ్మణ స్వాతంత్రం కోసం పోరాడినట్లు ఎక్కడైనా చరిత్రలో ఉంటే నిరూపించగలరా అని సైరా విషయంలో వివాదం సృష్టిస్తున్న వారికి పరుచూరి సవాల్ విసిరారు. మరి ఈయన విసిరిన సవాల్ కు ఎవరైనా సమాధానం చెబుతారు లేదో చూడాలి.
 

More Related Stories