చిరంజీవి ముఖ్య అతిథిగా విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ

తెలుగు ఇండస్ట్రీలో విశ్వ నటచక్రవర్తి అంటే ఒక్క ఎస్వీ రంగారావు మాత్రమే. ఈయన కాంస్య విగ్రహాన్ని పద్మభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. 6 అక్టోబర్ 2019 ఉదయం 10.15 నిమిషాలకు తాడేపల్లిగూడెం యస్.వి.ఆర్.సర్కిల్, కె.యన్.రోడ్ లో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సైరా నరసింహారెడ్డితో విజయం అందుకున్న తర్వాత ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న చిరు.. ఇచ్చిన మాటకు కట్టుబడి విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్నందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్వీ రంగారావు సేవాసమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రంతో సంచలన విజయం అందుకున్న ఆనందంలో ఉన్నారని.. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ అద్భుతంగా నటించారని చెప్పారు. 5 భాషల్లో విడుదలైన సైరా విజయం తెలుగు వారి విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ఒక గొప్ప చారిత్రక విజయం అందుకున్న సందర్భంగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణకు ఆయన విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు నిర్వాహకులు. ఇచ్చిన మాట కోసం కమిట్మెంట్తో మెగాస్టార్ ఈ ఆవిష్కరణకు విచ్చేస్తున్నారు. ఓ వైపు సైరా ప్రచారంలో బిజీగా ఉండీ ఆయన మాటకు కట్టుబడి విచ్చేయడం సంతోషాన్నిస్తోంది. అక్టోబర్ 6న ఉదయం గన్నవరం నుంచి తాడేపల్లి చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అటుపై తిరిగి మెగాస్టార్ హైదరాబాద్ కి వచ్చేస్తారని చెప్పారు వాళ్లు. చిరంజీవిని చూడ్డానికి అభిమానులు కూడా భారీగా వస్తారని తెలుస్తుంది.