English   

లెజెండరీ దర్శకుడు మణిరత్నంపై దేశద్రోహం కేసు..

Mani Ratnam
2019-10-05 16:39:42

అదేంటి.. మణిరత్నంపై దేశద్రోహం కేసు పెట్టడం ఏంటి.. ఆయన ఏం తప్పు చేశాడు.. సినిమాలు చేయడం తప్ప ఆయనకు మరో లోకం కూడా తెలియదు కదా.. అలాంటి దర్శకుడిపై దేశద్రోహం కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా. కానీ ఇప్పుడు ఇదే జరిగింది. ఆయనతో పాటు మరో నలుగురు ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టారు అధికారులు. కొన్ని రోజుల కింద భారతదేశంలో జరుగుతున్న దాడులు, హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్న 50 మందిని ఎంచుకుని వాళ్లపై బహిరంగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశాడు మణిరత్నం. అప్పట్లో ఈయనతో పాటు రామచంద్ర గుహ, అపర్ణా సేన్‌ కూడా ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పై కూడా దేశద్రోహ కేసు నమోదైంది. మూడు నెలల క్రితం దేశంలో అసహనం పెరిగిపోతుందని, మాబ్ లించింగ్ మితిమీరుతుందంటూ అదూర్ గోపాల్ కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యాం బెనగల్‌ అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ, శుభ ముద్గల్ సహా పలువురు సెలెబ్రిటీలు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. మణిరత్నంతో పాటు పలువురు ప్రముఖులు ఇలా రేఖ రాయడంతో దీనికి నిరసనగా సుధీర్ కుమార్ ఓజీ బీహార్ లోని ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. గౌరవనీయమైన స్థానంలో ఉండి దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా మణిరత్నం తో పాటు మరికొందరు ప్రవర్తించారని.. వాళ్లపై కచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టాల్సిందేనంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దానికితోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రతిష్టను దిగజార్చే విధంగా వీళ్లు ప్రవర్తించారంటూ ఆయన కోర్టు ముందు విన్నవించుకున్నాడు. పైగా వారు లేఖలో పేర్కొన్న 50 మంది ప్రముఖులు సంతకాలు చేశారని ఆరోపిస్తూ ఓజా కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ అంగీకరించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ లేఖ రాసిన యాభై మంది ప్రముఖులపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆగస్ట్ 20న ఉత్తర్వులు ఇచ్చారని.. ఈ క్రమంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైందని ఓజా చెప్పారు. ఇదే క్రమంలో ప్రధాన మంత్రి మోడీ పాలనలోనే భారత దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఏకంగా ప్రధానమంత్రి ప్రభుత్వాన్ని ఉద్దేశించి 50 మంది లేఖ రాయడం వెనుక వామపక్ష భావజాల ప్రభావం ఉందని భావిస్తున్నారు. కమ్యూనిస్టు భావజాలంతోనే వారంతా మోదీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని గతంలో కామెంట్స్ చేశారు. అయితే దీనికి మరో 62 మంది సెలబ్రిటీలు ఎదురు తిరిగారు. మొత్తానికి ఇప్పుడు మణిరత్నంపై పెట్టిన దేశద్రోహం కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

More Related Stories