గోపీచంద్ చాణక్య.. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్..

ఈ సామెత ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా..? ఇప్పుడు గోపీచంద్ చాణక్య సినిమా చూసిన తర్వాత అందరికీ అనిపించింది ఇదే. వరస ఫ్లాపులు వస్తున్నాయి కదా.. కాస్త శ్రద్ధ పెట్టి మరీ రా ఏజెంట్ కథ చేసాడు ఈ హీరో. తమిళ దర్శకుడే అయినా కూడా తిరు దీన్ని బాగానే హ్యాండిల్ చేసాడు. అయితే కథ మరీ రొటీన్ కావడం.. దానికితోడు రొటీన్ స్క్రీన్ ప్లే ఇక్కడ అసలు చిక్కుల్ని తీసుకొచ్చింది. గోపీచంద్ తన పాత్ర వరకు చంపేసాడు.. ఈ పాత్ర కోసమే పుట్టాడా అనేంతగా ఇందులో ఒదిగిపోయాడు. రా ఏజెంట్ గా ప్రాణం పెట్టి నటించాడు. పాకిస్తాన్ కూడా వెళ్లి అక్కడ ఔరా అనిపించాడు. కానీ కథ సహకరించకపోతే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు..? ఇప్పుడు చాణక్య విషయంలో ఇదే జరుగుతుంది. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది కానీ గోపీ నటనకు మాత్రం నూటికి నూరు మార్కులు పడుతున్నాయి. గతంలో వచ్చిన చాలా రా సినిమాలను తీసుకుని మిక్సీలో కొట్టి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చాణక్య. అయితే ఆ సినిమాల్లో ఉన్నంత మ్యాటర్ ఇందులో కనిపించదు. మంచి నేపథ్యం తీసుకున్నా కూడా కాస్త అనుభవం ఉన్న దర్శకుడు అయ్యుంటే ఈ సినిమాను ఇంకా బాగా హ్యాండిల్ చేసేవాడు. గోపీచంద్ గత సినిమాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ సినిమానే.. కానీ కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేది కష్టమే.