English   

ఇరవై రెండేళ్ళ తర్వాత మళ్ళీ అదే పాత్ర చేస్తున్న ప్రకాష్ రాజ్  

prakash
2019-10-06 19:31:57

ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి ఆ పాత్రలో జీవించే విలక్ష నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కరుణానిధిగా కనిపించబోతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో ప్రకాశ్‌రాజ్ కరుణానిధి పాత్రలో నటిస్తున్నారు. తమిళ రాజకీయాలకు మణిరత్నం దృశ్య రూపం గా ఇద్దరు సినిమా తీస్తే అందులో కరుణానిధి పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశారు నటుడు ప్రకాష్ రాజ్.  

తమిళ రాజకీయాలంటేనే ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వీళ్ల మధ్య స్నేహం నుంచి రాజకీయ శతృత్వం వరకు ప్రతి ఘట్టాన్ని ఇద్దరు చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారు మణిరత్నం. కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ చక్కగా ఒదిగిపోయారు. ఎంజీఆర్ పాత్రలో మోహన్ లాల్‌కు , ఆయనకు మధ్య జరిగిన సంభాషణలు, భావోద్వేగం చిత్రానికే హైలెట్‌గా నిలిచాయి. 22 ఏళ్ల తరువాత అదే పాత్రలో.. విలక్షణ నటుడు 1997లో రిలీజ్‌ అయిన ఇద్దరు సినిమాలో కరుణానిధి పాత్రలో నటించిన ప్రకాష్‌ రాజ్‌ ఇన్నేళ్ల తరువాత జయలలిత బయోపిక్‌లోనూ అదే పాత్రలో నటించనున్నాడు. 

బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జయ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జయ పాత్రలో నటించేందుకు కంగనా చాలా కసరత్తులు చేస్తోంది. మేకప్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు బరువు కూడా పెరుగుతోంది. విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఎల్‌ విజయ్ దర్శకుడు. ప్రస్తుతం సినిమాకు నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే కీలకమైన ఎమ్జీఆర్‌ పాత్రకు అరవింద్‌ స్వామిని తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. 

తాజాగా మరో కీలక పాత్రలో జయ రాజకీయ ప్రత్యర్థి కరుణానిథి పాత్రకు ఓ ప్రకాష్ రాజ్‌ ని ఎంపిక చేశారు. దాదాపు 22 ఏళ్ల తరువాత మరోసారి ప్రకాష్‌ రాజ్‌, కరుణా నిధి పాత్రలో నటిస్తుండటంతో జయ బయోపిక్‌పై ఆసక్తి కలుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ సంగీతమందిస్తుండగా, నీరవ్‌ షా సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో తలైవి, హిందీలో జయ అనే పేర్లను పరిశీలిస్తున్నారు.

More Related Stories