చిరంజీవి, కొరటాల సినిమాలో రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్..

మెగా హీరోలు ఇప్పుడు కలిసి నటించడానికి ఏ మాత్రం సంశయించడం లేదు. కాకపోతే వాళ్లను కలిపే కథ రావాలంతే. అలా వచ్చినపుడు ఒకరి సినిమాల్లో ఒకరు కనిపించడానికి పెద్దగా అడ్డుచెప్పరు. ఇదివరకే ఇది ప్రూవ్ అయింది కూడా. అన్నయ్య కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ కూడా కాదని శంకర్ దాదా రెండు భాగాల్లో కాసేపు అలా కనిపించాడు. ఇక తనయుడు చరణ్ కోసం చిరంజీవి కూడా మగధీర.. బ్రూస్లీల్లో దర్శనమిచ్చాడు. చిరు కోసం చరణ్ కూడా అలా ఖైదీ నెం.150లో కాలు కదిపాడు. అంటే వాళ్లకు సందర్భం దొరికితే కలిసి కనిపిస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు కొరటాల శివ కూడా ఇదే చేస్తున్నాడు.
తను చిరంజీవి కోసం రాసుకుంటున్న కథలో చరణ్ కు కూడా చిన్న పాత్ర ఒకటి సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. కథను మలుపుతిప్పే అతి కీలకమైన పాత్ర ఇది. పవర్ ఫుల్ గానూ ఉంటుందని తెలుస్తుంది. మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తానని సైరా ప్రెస్ మీట్ లో చెప్పాడు మెగాస్టార్. అది ఇదే అని తెలుస్తుంది. కొరటాల తను రాసుకున్న పాత్ర కోసం చరణ్ ను ఒప్పించాలని చూస్తున్నాడు. ఇందులో నిరుద్యోగ సమస్య గురించి చెప్పబోతున్నాడు కొరటాల శివ. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పవర్ ఫుల్ రోల్ కోసం చరణ్ ను తీసుకోవాలని చూస్తున్నాడు.
అయితే ఇప్పటి వరకు చరణ్ నుంచి మాత్రం కన్ఫర్మేషన్ రాలేదు. ఈయన ప్రస్తుతం రాజమౌళి దగ్గర బంధీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ కోసం మరో ఏడాది పాటు అక్కడే ఉండబోతున్నాడు రామ్ చరణ్. అక్కడ్నుంచి రిలీజ్ అయిన తర్వాత కానీ తర్వాతి సినిమాపై దృష్టి పెట్టడు. మరి ఇలాంటి సమయంలో చిరు సినిమాలో చిన్న పాత్రలో చరణ్ కనిపిస్తాడా అనేది ఆసక్తికరమే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. దసరా సందర్భంగా ముహూర్తం జరగనుంది. నవంబర్ నుంచి సినిమా పట్టాలెక్కనుంది. అన్నీ కుదిరి అన్నయ్య సినిమాలో చరణ్ కానీ నటిస్తే మెగాభిమానులకు పండగే పండగ.