రజినీకాంత్ గారూ.. ఇది మీకేమైనా న్యాయంగా ఉందా..

దేవుడు శాసించాడు.. నేను పాటించాను అంటూ ఏడాదిన్నర కింద రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు రజనీకాంత్. అప్పుడు ఒక్కసారి శాసించిన దేవుడు మళ్లీ ఇప్పటివరకు రజనీకాంత్ ను శాసించడం మర్చిపోయినట్లున్నాడు. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సంగతి కూడా మర్చిపోయి హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన తీరు అభిమానులకు కూడా కోపం తెప్పిస్తుంది. రజినీకాంత్ తీరుపై కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకపోతే రాను అని చెప్పాలి అంతే కానీ వచ్చిన తర్వాత ఇలా వరుసగా సినిమాలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు రజనీకాంత్. దీన్ని బట్టి ఆయన రాజకీయాలను లైట్ తీసుకుంటున్నారా లేదంటే నేరుగా ఎన్నికలకు పోయినా కూడా కేవలం తన బొమ్మ చూసి ఓట్లు వేస్తారని అతివిశ్వాసంతో ఉన్నాడో అర్థం కావడం లేదు. ఓ వైపు కమల్ హాసన్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసాడు. కానీ రజినీ మాత్రం 2021 వరకు వేచి చూస్తానని చెబుతున్నాడు. రజినీకాంత్ ఏమీ పట్టనట్లు వరసగా సినిమాలు చేయడం అభిమానులను సందిగ్ధంలో పడేస్తుంది. ఇప్పటికైనా ఈయన ఓ నిర్ణయం తీసుకోవాలని.. రాజకీయాల్లోకి సీరియస్ గా వస్తున్నాడా లేదంటే సినిమాలతోనే బిజీ అవుతున్నాడా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గతేడాది కాలా, 2.0 సినిమాలతో వచ్చిన రజినీకాంత్.. ఈ ఏడాది పేటతో వచ్చాడు. ఇప్పుడు దర్బార్ షూటింగ్ కూడా పూర్తి చేసాడు. ఇది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఇప్పుడు సిరుత్తై శివతో మరో సినిమా ఓకే చేసాడు. ఈ సినిమా వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు నిర్మాతలు. మొత్తానికి వరసగా రజినీ సినిమాలు చేస్తుంటే ఆనందంగానే ఉంది కానీ రాజకీయాల పరిస్థితి ఏంటి అంటూ అభిమానులు నిలదీస్తున్నారు.