సందీప్ రెడ్డి టాలెంట్ తెలుగు ఇండస్ట్రీకి కనిపించడం లేదా..

ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సినిమా దృష్టిని అంతగా ఆకట్టుకున్న దర్శకుడు అప్పట్లో రామ్ గోపాల్ వర్మ.. ఆ తర్వాత ఇప్పుడు సందీప్ రెడ్డి వంగానే. అప్పట్లో శివ సినిమాతో ఈయన సంచలనాలు సృష్టిస్తే.. ఇప్పుడు కబీర్ సింగ్ సినిమాతో ఈయన అదే చేస్తున్నాడు. పైగా ఈ రెండు పాత్ బ్రేకింగ్ సినిమాలే. అప్పట్లో శివ సినిమా తెలుగు సినిమా రూపురేఖలను మార్చేసింది. రెండేళ్ల కింద అర్జున్ రెడ్డి కూడా ఇదే చేసింది. ఇప్పుడు హిందీలో కబీర్ సింగ్ కూడా ఇదే చేసి చూపించింది. ఈ సినిమా విషయంలో విజయంతో పాటు విమర్శలు కూడా అందుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగా. కలెక్షన్ల విషయంలో 300 కోట్లు వసూలు చేసింది కబీర్ సింగ్. షాహిద్ కపూర్ కు చాలా రోజుల తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ ఇది. ఈ సినిమాను క్రిటిక్స్ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. అసలు సందీప్ రెడ్డి దర్శకుడే కాదంటూ ఆయనపై దుమ్మెత్తిపోసారు. అంతేకాదు.. ఈ సినిమాకు రేటింగ్ కూడా తక్కువగానే ఇచ్చారు బాలీవుడ్ క్రిటిక్స్. దానికితోడు మహిళలను హీనంగా చూపించారని కూడా సందీప్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు.
అయితే ఇవన్నీ అసలు సందీప్ పట్టించుకోలేదు సరికదా పై నుంచి మళ్లీ బాలీవుడ్ క్రిటిక్స్ తోనే ఆడుకుంటున్నాడు. అసలు వాళ్లకు సినిమా చూడటం వస్తే కదా.. తన సినిమా గురించి మాట్లాడటానికి అంటున్నాడు. కబీర్ సింగ్ వైలెంట్ సినిమా అని కామెంట్ చేసిన వాళ్లకు అసలు వైలెంట్ సినిమా అంటే ఎలా ఉంటుందో తన తర్వాతి సినిమా చూపిస్తానంటూ సవాల్ చేసాడు ఈ కుర్ర దర్శకుడు. క్రైమ్ కామెడీతో ఈ సినిమా రానుంది. నాతో పెట్టుకోవద్దు.. సత్తా ఏంటో చూపిస్తా అంటున్నాడు. అన్నట్లుగానే ఇప్పుడు తన రెండో సినిమాను బాలీవుడ్ లోనే చేస్తున్నాడు ఈయన. అక్కడే భూషన్ కుమార్ నిర్మాణంలో రెండో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. నిజానికి మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నా కూడా ఈయనకు డేట్స్ ఇవ్వకుండా ఆడుకున్నాడు సూపర్ స్టార్. అందుకే ఇప్పుడు సందీప్ తన దారి తాను చూసుకున్నాడు.