మరో రీమేక్ తో నాగ్ రెడీ...ఈసారి బాలీవుడ్ !

ఈ ఏడాది మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఆ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. ఓ ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన మన్మథుడు 2 బాక్సాఫీస్ ముందు బోల్తా పడటమే కాక నాగ్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది. దీంతో దిద్దుబాటు చర్యల్లో పడ్డ నాగ్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో పడ్డాడు. అయితే మొన్నటి వరకు సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమాని తెరకెక్కిస్తారని ప్రచారం జరుగగా ఆ విషయం మీద మళ్ళీ వార్తే లేదు.
అయితే తాజాగా నాగ్ మరో బాలీవుడ్ సినిమాని రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది అజయ్ దేవగణ్, ఇలియానాలు ప్రధాన పాత్రలలో వచ్చిన రైడ్ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట నాగ్. 80లలో జరిగిన కొన్ని నిజజీవిత ఘటనలు ఆధారంగా రెయిడ్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది.
ఇప్పుడు అందుకే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో పడ్డాడట నాగ్. నాగార్జున ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మరో మూడు వారాల్లో ఈ పూర్తి కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో ఈ రీమేక్ గురించి చర్చలు కూడా జరిపారట. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.