మహేష్ ఈజ్ కింగ్ అంటున్న అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటిదాకా అసలు ఫ్లాప్ లేని డైరెక్టర్, మరోపక్క మహేష్ కావడంతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. జనవరి 12న సినిమా రిలీజ్ అంటూ అధికారిక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలివుందట. ఆ షెడ్యూలు కూడా పూర్తయితే సరిలేరు నీకెవ్వరూ టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. కాగా లేటెస్ట్ షెడ్యూల్ నందు విలన్ ఇంట్లో నడిచే కొన్ని సీరియస్ సన్నివేశాలు పూర్తి చేశామని ఆ షెడ్యూల్ పూర్తయిందని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్ చేయడంలో కాస్త క్రియేటివిటీ వాడాడు అనిల్.
చదరంగం బోర్డు పోస్ట్ చేసి అందులో రాజు ఒక్కడే ఉన్నట్టుగా పోస్ట్ చేశాడు. నిజానికి మహేష్ సినిమా రిలీజ్ అవుతున్న రోజే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమా బరిలో ఉన్నా సరే కింగ్ మహేశే కాబట్టి తమకు ఎదురు లేదనట్టుగా పోస్ట్ చేశాడు. మరి దీనికి బన్నీ శిబిరం నుండి ఏమని కౌంటర్ వస్తుందో వేచి చూడాలి