రివ్యూలు నిజంగానే సినిమా ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయా..

ప్రేక్షకులకు, హీరోలకు మధ్య వారధి మీడియానే. ఓ సినిమా హిట్ అవ్వాలన్నా.. ఫ్లాప్ అవ్వాలన్నా.. దాని ఫలితం జనాలకు తెలియాలన్నా.. పెద్ద వారధి మాత్రం మీడియానే. ఎవరు ఔనన్నా కాదన్నా.. ఓ సినిమా ఫలితంలో సినిమా జర్నలిస్ట్ ల కృషి కూడా ఉంటుంది. అలాంటి వాళ్లను తిట్టడం ఎంత వరకు సబబు..? ఇండస్ట్రీలో కొందరు ఇదే చేస్తున్నారిప్పుడు. తమ సినిమాకు మంచి రేటింగ్స్ ఇస్తేనేమో వాళ్లు మంచోళ్లు.. లేదంటే మాత్రం రివ్యూవర్లే సినిమాను నాశనం చేస్తున్నారంటూ మీడియా ముందుకొచ్చి నోరు పారేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర్నుంచి మొదలు పెడితే బన్నీ, విశాల్ లాంటి స్టార్ హీరోలు కూడా రివ్యూ రైటర్స్ పై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా కమెడియన్ అలీ కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసాడు.
ఆ మధ్య సరైనోడు సినిమా విషయంలో తొలిరోజు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. విశ్లేషకులు కూడా సినిమా యావరేజ్ గానే తేల్చేసారు. కానీ అదృష్టం కలిసొచ్చి.. మరోపోటీ లేక సినిమా మంచి వసూళ్లు సాధించింది. అప్పటికి బన్నీ కెరీర్ లోనే హైయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం. సరైనోడు సినిమా సక్సెస్ రేంజ్ చూసి ఏసీ రూమ్స్ లో కూర్చుని సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయడానికి రివ్యూ రైటర్లు ఎవరు.. బి, సి ప్రేక్షకుల మనసు వాళ్లకెలా తెలుస్తుంది.. కాస్త వాళ్ల ఆలోచన శైలి మార్చుకుంటే మంచిది అన్నట్లు మాట్లాడాడు బన్నీ. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా జై లవకుశ టైమ్ లో రివ్యూ రైటర్స్ పై కాస్త సెటైర్లు వేసాడు. విశాల్ అయితే ఏకంగా రివ్యూలనే బ్యాన్ చేయాలన్నాడు. ఇక ఇప్పుడు అలీ అయితే మీరెవ్వర్రా కోన్ కిస్కా గొట్టంగాళ్లూ అంటూ మాట్లాడేసాడు. కంటెంట్ బాగున్న సినిమాలకు సినిమా అదుర్స్ అని రాసేది అదే రివ్యూ రైటర్లే కదా..! మరి ఆయన సినిమాలకు పాజిటివ్ గా రాసినపుడు ఓ రూల్.. రాయనపుడు ఓ రూల్.. ఇదెంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నారు ఇండస్ట్రీలోని సీనియర్ విశ్లేషకులు. దీనికి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో మరి..!