English   

ఖైదీ రివ్యూ

 Khaidi
2019-10-25 16:20:48

కార్తి సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ ప్రయోగాలు కూడా చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఖైదీ అంటూ పక్కా ప్రయోగాత్మక సినిమాతో వచ్చాడు.. మరి ఇదెలా ఉందో చూద్దాం..

కథ:

ఢిల్లీ (కార్తి) ఖైదీ. యావజ్జీవ ఖైదీ శిక్ష నుంచి ఆ రోజే  విడుదలై పదేళ్ల కూతురుని చూసుకోడానికి బయల్దేరతాడు. అంతలో ఆయనపై అనుమానం వచ్చి పోలీసులు తీసుకొస్తారు. అప్పుడే ఓ పెద్ద పార్టీ జరిగి అందులో డ్రగ్ ఎఫెక్టుతో పోలీసులంతా తాగి పడిపోతారు. అప్పుడు హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి ఓ లారి డ్రైవర్ కావాల్సి వస్తుంది. దాంతో అక్కడే ఉన్న ఆఫీసర్ (నరైన్) ఢిల్లీ సాయం తీసుకుంటాడు. కానీ దానికి ముందే 800 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేస్తాడు అదే ఆఫీసర్. అప్పుడు ఆ పోలీసులను.. డ్రగ్స్ ను తిరిగి సంపాదించుకోడానికి ఢిల్లీ తీసుకెళ్తున్న లారీపై అటాక్స్ జరుగుతాయి. అప్పుడు ఏం జరిగిందనేది కథ..

కథనం:

ఏదైనా సినిమా కథ చెప్పరా అంటే రెండు ముక్కల్లో చెప్తా అంటాం కదా.. ఖైదీ సినిమా చూస్తుంటే నిజంగా అదే అనిపించింది నాకు.. ఇక్కడ రెండు ముక్కలు కూడా కాదు.. ఒకే ముక్క.. ఒకే రాత్రిలో కథ.. కేవలం కొన్ని గంటల్లో జరిగే కథను లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తెరకెక్కించాడు.. దీన్ని థ్రిల్లర్ అనాలో.. సస్పెన్స్ అనాలో.. ఏదైనా కూడా సినిమా మంచి ఎంటర్‌టైనర్.. రాత్రికి మొదలై.. పొద్దున్నే సూర్యుడు వచ్చేలోపు శుభం కార్డ్ పడిపోయే కథ ఇది.. ఓ ఖైదీ.. పోలీస్ మధ్య జరిగే సన్నివేశాలు.. మధ్యలో మరో డ్రగ్ గ్రూప్ గొడవలు.. రాజకీయ కుట్రలు.. తండ్రీ కూతురు సెంటిమెంట్.. ఇవన్నీ ఇంత చిన్న కథలోనే చూపించేసాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్.. కథ అర్థమైపోతున్నా.. కథనం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.. స్క్రీన్ ప్లే మాయాజాలంతో కథలో మూడు కోణాల్ని ఒకేసారి చూపించాడు దర్శకుడు.. ఓవైపు కార్తి ఎపిసోడ్.. మరోవైపు డ్రగ్ ముఠా అటాక్.. మరోవైపు స్టూడెంట్స్ ఎపిసోడ్.. మూడింటిని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసాడు ఈ దర్శకుడు.. కార్తి లాంటి స్టార్ హీరో ఇలాంటి కథను జడ్జ్ చేయడం.. ఒప్పుకోవడం నిజంగానే గొప్ప విషయం.. సింగిల్ క్యాస్ట్యూమ్‌లో.. సింగిల్ నైట్‌లో జరిగే కథ అన్నపుడు హీరోకు భయం ఉంటుంది.. కానీ దర్శకుడిని, కథను నమ్మి ముందుకెళ్లిపోయాడు.. నటుడిగా ఖైదీతో మరో మెట్టెక్కేసాడు కార్తి.. నరైన్ కూడా సపోర్టింగ్ రోల్ బాగా చేసాడు.. రొటీన్ సినిమాల మాదిరి పాటలు కావాలి.. కామెడీ కావాలి అనుకుంటే ఖైదీకి దూరంగా ఉండటమే బెటర్.. అలా కాదు.. భిన్నమైన ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఖైదీని హాయిగా ఓ లుక్కేయొచ్చు.. ఓవరాల్‌గా ఖైదీ.. కార్తి నుంచి మరో భిన్నమైన సినిమా..

నటీనటులు:

కార్తి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.. ఈ సినిమాతో మరో మెట్టెక్కేసాడు. ఒకే రాత్రిలో జరిగే కథ కావడంతో మంచి నటన చూపించే అవకాశం లభించింది. నరైన్ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో కూడా అంతా న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

స్యామ్ సిఎస్ సంగీతం చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్ఆర్ అదిరిపోయింది. పాటలు ఇందులో లేవు. కేవలం స్క్రీన్ ప్లేతో సినిమాను అద్భుతంగా నడిపించాడు దర్శకుడు లోకష్ కనకరాజ్. లోకేష్ రాసుకున్న కథ.. కథనం అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కథ చిన్నదే అయినా కథనం మాత్రం చాలా కొత్తగా అనిపించింది.

ఖైదీ.. కేక పెట్టించే యాక్షన్ డ్రామా..

రేటింగ్: 3.25/5.

More Related Stories