స్టార్ హీరో ఇంటికి బాంబు బెదిరింపు...కానీ

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదలైంది. నయనతార విజయ్‌కు జోడీగా నటించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో చేరినట్లు చెబుతున్నారు. అయితే ఆ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా విజయ్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మొహరించారు. మొన్న శనివారం రాత్రి చెన్నై కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టామని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. అది ఏ క్షణానైనా పేలొచ్చని బెదిరించాడు. దాంతో పోలీసులు హుటాహుటిన విజయ్ ఇంటికి చేరుకున్నారు.
ఇల్లంతా తనిఖీలు చేశారు. అయితే బాంబ్ లాంటిది ఏదీ మాత్రం దొరకలేదు. ఎందుకైనా మంచిదని ఆయన ఇంటి చుట్టూ భారీగా భద్రత ఏర్పాటుచేశారు. అనంతరం విజయ్ తండ్రి నిర్మాత అయిన చంద్రశేఖర్ నివాసానికి కూడా వెళ్ళిన పోలీసులు అక్కడ కూడా తనిఖీలు చేశారు. అక్కడా బాంబ్ దొరకలేదు. ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అళపాక్కమ్ ప్రాంతంలోని పోరూర్ సమీపం నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ చేసిన కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు ప్రశ్నలకి ఆ యువకుడు పొంతన లేని సమాధానాలు చెప్పి వారిని అయోమయానికి గురిచేస్తున్నాడని సమాచారం. ఈ ఏడాది మార్చిలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, సూపర్‌స్టార్ రజినీ కాంత్ ఇళ్లకు బాంబు బెదిరింపుల కాల్ కలకలం రేపింది. అప్పుడు కూడా ఈ రెండిళ్లలోనూ సోదాలు జరపగా అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లేనట్లు తేలింది. విచారణ జరిపిన పోలీసులు ముహమూద్ అలీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పోలీసులకు ఇలాంటి సమాచారం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.