సుకుమార్ మొదలుపెట్టాడు.. కథ ఎలా ఉండబోతుందో తెలుసా..

సుకుమార్.. ఈయన ఓ భిన్నమైన దర్శకుడు. అందర్లాంటి సినిమాలు చేయడం ఈయనకు ఎందుకో ఇష్టం ఉండదు. హాలీవుడ్ రేంజ్ కు తెలుగు సినిమాను తీసుకెళ్దామనుకుంటాడు.. కానీ మన ప్రేక్షకులే అక్కడికి రారు. అందుకే సుకుమార్ సినిమాలు పెద్దగా ఆడవు. ఎప్పుడూ అర్థం కాని కథలను తీసుకుని ప్రయోగాలు చేయడం ఈ దర్శకుడి అలవాటు. మహేశ్ నేనొక్కడినే.. రామ్ జగడం.. నాన్నకు ప్రేమతో.. ఇలా బాగా టిపికల్ గా ఆలోచిస్తుంటాడు ఈ దర్శకుడు. కానీ అలాంటివన్నీ పక్కనబెట్టి సగటు ప్రేక్షకుడి కోసం ఈయన చేసిన రంగస్థలం సంచలన విజయం సాధించింది. రామ్ చరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం నెంబర్ వన్ గా నిలిచింది. అలాంటి సినిమా తర్వాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు బన్నీతో సినిమా మొదలుపెట్టాడు సుకుమార్. అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసి కూడా చాలా రోజులైపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి ముహూర్తం పెట్టారు దర్శక నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య.. ఆర్య 2 సినిమాలు వచ్చాయి. ఇందులో ఆర్య ట్రెండ్ సెట్టర్ అయితే.. ఆర్య 2 డిజాస్టర్. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ కలవబోతున్నారు. ఈ సారి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కథతో వస్తున్నారు సుకుమార్, బన్నీ. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. జబర్దస్త్ యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించబోతుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.