ప్రకాశ్‌రాజ్‌కు అవకాశాలు ఇవ్వొద్దు....హిందూ మహాసభ హెచ్చరిక

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలని కర్ణాటక సినిమా చాంబర్ లో ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారని, ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వవద్దని అఖిల భారత హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక వార్తా చానెల్ చర్చలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ ఉత్తర ప్రదేశ్‌లో రధోత్సవం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడి రథోత్సవానికి ముంబై నుంచి హెలికాప్టర్ల మోడళ్లను పిలిపిస్తున్నారని మేకప్ చేసి ఆ మోడళ్లతో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి వేషాలు వేయిస్తున్నారని, వారికి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఘనంగా పూల స్వాగతం పలుకుతున్నారని, ఐఏఎస్ అధికారులు వారికి నమస్కరిస్తున్నారని, ఈ విధమైన చర్యలు దేశానికి ప్రమాదకరమని అంటూ పేర్కొన్నారు.
అయితే ఆ సందర్భంలో ఇది ప్రజాస్వామ్య దేశం అని ఎవరైనా వారికిష్టం వచ్చినట్లు చేయవచ్చని అందరి మనోభావాలకు విలువివ్వాలని యాంకర్ కోరారు. కానీ ప్రకాశ్ రాజ్ చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూస్తుంటే మౌనంగా ఎలా ఉంటామని, అదే విధంగా దేశానికి ప్రమాదకర విషయాలను ప్రశ్నించాల్సిందేనని చెప్పారు. వేడుకల పేరిట మైనార్టీలకు భయపెట్టే సన్నివేశాలను సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందూ మహాసభ ప్రకాశ్‌రాజ్‌పై ఫిర్యాదు చేసింది. ఆయనను కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని, ఆయనకు కన్నడ సినిమాల్లో అవకాశం కల్పించరాదని, ఒకవేళ ఇస్తే మున్ముందు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఫిర్యాదులో పేర్కోన్నారు.