మరో టాలీవుడ్ నటుడికి అస్వస్థత

తెలుగు ఇండస్ట్రీకి గ్రహణం లాంటిది ఏమైనా పట్టిందా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని వార్తలు వింటుంటే. ఇండస్ట్రీలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే మాత్రం వెంటనే టెన్షన్ పడుతున్నారు. మొన్నటికి మొన్న కమెడియన్ వేణుమాధవ్, నిన్న నటి గీతాంజలి మరణాలు మిగిల్చిన విషాదం మరువక ముందే, మరో సీనియర్ నటుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడనే వార్త అందరిలోనూ గుబులు రేపుతోంది. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, నాటక రూపకర్త అయిన గొల్లపూడి మారుతి రావు ఇప్పుడు అనారిగ్యంతో బాధ పడుతున్నారు.
దీంతో చెన్నైలో చికిత్స పొందుతున్న గొల్లపూడి మారుతీరావుని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్య గొల్లపూడి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా గొల్లపూడి కుమారులతో కూడా ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. గొల్లపూడి మారుతీరావు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.