మా వాడు ఇప్పట్లో రాడు.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన బాలయ్య..

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. జూనియర్ బాలయ్య వస్తాడు.. వచ్చీ రాగానే బాక్సాఫీస్ తాట తీస్తాడు అనే ఊహల్లో ఉన్నారు అభిమానులు. పైగా నందమూరి ఫ్యామిలీ అంటేనే మాస్.. వాళ్లకు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ మరెవరికీ ఉండదు. ఒక్క సినిమా హిట్టైతే చాలు ఆటోమేటిక్ గా స్టార్స్ అయిపోతారు. సింహాద్రి ఎఫెక్ట్ తో ఇప్పటికీ సూపర్ స్టార్ గానే ఉన్నాడు ఎన్టీఆర్.
బాలయ్య సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడో ఓ సారి హిట్ కొట్టినా..అది సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నాడు. అతడే మోక్షజ్ఞ. 13 ఏళ్ల కింద నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తోన్న వారసుడు మోక్షు. కళ్యాణ్ రామ్ తర్వాత మళ్లీ కొత్త హీరో ఎవరూ రాలేదు. అఖిల్ 20 ఏళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. చరణ్ కూడా అప్పట్లో 22 ఏళ్లకే హీరో అయ్యాడు.. బన్నీ అయితే మరీ 18 ఏళ్లకే వచ్చేసాడు.. నాగచైతన్య 22 కు వచ్చాడు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా 20 ల్లోకి వచ్చేసాడు. దాంతో వారసున్ని త్వరగా తీసుకురావాలని అభిమానులు కూడా గోల పెడుతున్నారు. అయితే ఇప్పుడు అభిమానులకు బాలయ్య మాత్రం ఊహించని షాక్ ఇచ్చాడు. హీరో అవుతాడు కానీ ఇప్పట్లో కాదని తేల్చేసాడు ఈయన.
ప్రస్తుతం మోక్షు చదువుకుంటున్నాడని.. ఆయనకు చదువు తప్ప మరో ప్రపంచం లేదని చెప్తున్నాడు. త్వరలోనే వస్తాడు కానీ ఆ త్వరలో ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు బాలకృష్ణ. రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నా కూడా ఎక్కడా అయితే క్లారిటీ రావడం లేదు. సాయి కొర్రపాటి మాత్రం మోక్షు కోసం ఇప్పటికే రానే వచ్చాడు రామయ్యా అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
తొలి సినిమా మాస్ ను మెప్పించేలా ఉంటుందా.. లేదంటే లవ్ స్టోరీ చేస్తాడా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం బాలయ్య మాటలు వింటుంటే ఇప్పట్లో మోక్షు ఎంట్రీకి మోక్షం లేనట్లే.