దేవీ శ్రీ ప్రసాద్ మాయ తగ్గిపోతుందా..

ఓ సినిమాలో ఆరు పాటలుంటే అందులో రెండు పాటలు నచ్చడమే ఇప్పుడు గగనంగా మారిపోయింది. అసలు ఒక్కో సినిమాలో అయితే పాటలు వినడం కూడా మానేసారు ప్రేక్షకులు. ఇప్పుడు అలా తయారయ్యాయి మన పాటల పరిస్థితి. దానికి దర్శకులు ఎంత కారణమో.. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అలాగే తయారయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తనకంటూ ఓ మార్క్ సృష్టించుకుని ముందుకెళ్తున్నాడు దేవీ శ్రీ ప్రసాద్.
ఇప్పటికీ ఈయన పాటలంటే ప్రేక్షకులకు పిచ్చి. ఏదో మాయ చేస్తాడనే నమ్మకం. గత కొన్నేళ్లుగా ఈయన తన ప్రతీ సినిమాలోనూ పాటలు దాదాపు వినేలా ఇస్తుంటాడు. కొన్ని సినిమాలు ఈయన మ్యూజిక్ కారణంగానే హిట్ అవుతుంటాయి కూడా. గతేడాది విడుదలైన రంగస్థలం పాటలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో పాటు భరత్ అనే నేను, హలో గురు ప్రేమకోసమే సినిమాల్లో మంచి పాటలే ఇచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే వినయ విధేయ రామ, ఎఫ్ 2 లాంటి సినిమాలకు పాటలు ఇచ్చాడు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. పాటల గురించి ఈ మధ్య నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటున్నాడు దేవీ. ఈయన పాటలు స్లో పాయిజన్. కచ్చితంగా మెల్లగా ఎక్కేస్తుంటాయి. కానీ ఇప్పుడు అది కూడా వర్కవుట్ కావడం లేదు. పైగా తమన్ సంగీతం ప్రేక్షకుల్లో వైరల్ అవుతుంది.
ముఖ్యంగా అల వైకుంఠపురములో పాటలు అయితే యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ సమయంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ మాత్రం కనీసం ఎక్కడా వినిపించడం లేదు. పైగా దేవీ రెమ్యునరేషన్ కారణంగా కొన్ని సినిమాలు కూడా మిస్ చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదే అదునుగా థమన్ మరింత రెచ్చిపోతున్నాడు. మొత్తానికి దేవీ మాయ తగ్గి తమన్ దూసుకొస్తున్నాడు.