చిరంజీవి అల్లుడుకు ఎన్ని కష్టాలొచ్చాయో పాపం..

చిరంజీవి అల్లుడికి కష్టాలా.. మెగాస్టార్ లాంటి మామ వెంట ఉన్నపుడు కష్టాలెందుకు వస్తాయి అనుకుంటున్నారా..? కానీ వస్తాయి.. ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ అన్నీ సుఖాలే కాదు అప్పుడప్పుడూ కష్టాలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు మెగా అల్లుడికి కూడా ఇవే కష్టాలు వస్తున్నాయి. ఈయన విజేత సినిమాతో ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అల్లుడు జాడ కనబడలేదు. విజేతకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఈయన మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు వచ్చాయి.
అయితే ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో వస్తున్నాడు చిరు అల్లుడు. ఈ సారి అంతా కొత్త టీంతో ముందుకొస్తున్నాడు. తన రెండో సినిమాను రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సూపర్ మచ్చి సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. కొత్త దర్శకుడు పులి వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 40 శాతం పూర్తయింది కూడా. నిజానికి సుధీర్ బాబు చేయాల్సిన ఈ చిత్రం ఇప్పుడు కళ్యాణ్ దేవ్ చేతుల్లోకి వచ్చింది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ఖుర్షీద్ (ఖుషీ) సహ నిర్మాతగా ఉన్నారు.
అయితే అంతా బాగానే ఉన్నా కూడా ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ఉన్నట్లుండి ఆపేసారని తెలుస్తుంది. దానికి కారణం తిప్పరా మీసం సినిమా.. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సినిమాకు కలెక్షన్స్ రాకపోవడంతో కళ్యాణ్ దేవ్ సినిమాపై ఆ ప్రభావం పడుతుందని తెలుస్తుంది. అందుకే కొన్ని రోజుల పాటు ఈ చిత్ర షూట్ ఆపేయాలని ఫిక్సైపోయారు నిర్మాతలు. రాజేంద్ర ప్రసాద్, వికే నరేష్, పోసాని కృష్ణమురళి, ప్రగతి ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి శ్రీ విష్ణు దెబ్బకు మెగా అల్లుడు కుదేలవుతున్నాడన్నమాట.