సంక్రాంతి సీజన్.. కాస్త క్లారిటీ కావాలి.. వచ్చేదెంతమంది..

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు.. వరసగా సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ సారి కూడా ఇదే జరుగుతుంది. 2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో ఎఫ్ 2 సినిమా మాత్రమే విజయం సాధించింది. ఆ సినిమాతో పాటు వచ్చిన వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు, పేట సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకేసారి ఇన్నిసినిమాలు రావడం కూడా దీనికి శాపంగా మారిపోయింది. ఇక ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. 2020 సంక్రాంతికి కూడా 4 సినిమాలు రానున్నాయి. అందులో అంతా స్టార్ హీరోలే ఉండటం విశేషం.
ఇప్పటికే బాలయ్య తను కేయస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సంక్రాంతికి వస్తుందని చెప్పాడు. కానీ షూటింగ్ అనుకున్న దానికంటే త్వరగానే పూర్తి కావడంతో డిసెంబర్ 20నే వస్తున్నాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా సంక్రాంతి పండక్కే రానుంది. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నాడు దిల్ రాజు. ఆయనకు ఆ తేదీ కూడా బాగానే కలిసొచ్చింది.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురములో సినిమాను పండక్కి.. పైగా జనవరి 12నే విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా జనవరి 15న విడుదల కానుంది. ఈ మూడు సినిమాలతో పాటు రజినీకాంత్ దర్బార్ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. ఇక వెంకీ మామ సినిమాను కూడా పండక్కే విడుదల చేయాలని చూస్తున్నారు.
ఒకేసారి 5 పెద్ద సినిమాలు వస్తే కచ్చితంగా అది కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని తెలిసినా కూడా ఎవరికి ఎవరూ తగ్గడం లేదు. మరి చూడాలిక.. చివరివరకు ఏం జరుగుతుందో..?