నాకేం కాలేదు బాగానే ఉన్నా

ఈరోజు ఉదయం హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై తాజాగా మీడియాకి సందేశాలు పంపారు రాజశేఖర్. నిన్న రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, అప్పుడు కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, కారు దగ్గరకి వచ్చారని లోపలున్నది రాజశేఖరేనని గుర్తు పట్టి కారు లోలనుండి బయటకి లాగారట. బయటకు వచ్చిన రాజశేఖర్ వెంటనే వారి ఫోన్ తీసుకొని మొదట పోలీసులకి, తర్వాత కుటుంబ సభ్యులకి సమాచారం అందించానని సమాచారం. అక్కడ నుండి వారి కారులోనే ఇంటికి బయలుదేరానని, జీవిత ఎదురు వచ్చి పికప్ చేసుకున్నారని రాజశేఖర్ పేర్కొన్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని రాజశేఖర్ స్పష్టం చేశారు.