ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేస్తున్న రాజ్ తరుణ్

లవర్ సినిమా భారీ డిజాస్టర్ తర్వాత యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కి పనైపోయింది అనుకున్నారు. ఎందుకంటే ఆయన నటించిన మరో సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. అయితే వరుస సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాణంలో `ఇద్దరి లోకం ఒకటే` అనే సినిమా చేస్తున్న ఈ కుర్ర హీరో మంచి జోరు మీదున్నాడు. జి.ఆర్.కృష్ణ దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని రాధా మోహన్ నిర్మిస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం రాజ్‌తరుణ్ కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాజ్‌తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కనుందట. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా బానే ఉన్నా ఎందుకో ఆడలేదు. ఇప్పుడు వీరు కలిసి మరో సినిమా చేయనున్నారని అంటున్నారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మించనున్నారు. ఈ సినిమా జనవరి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుందని సమాచారం. ఇక రాజ్ తరుణ్ లాంచింగ్ మూవీ అయిన ఉయ్యాల జంపాల సినిమాని అన్నపూర్ణ బ్యానరే రూపొందించిన సంగతి తెలిసిందే.