పునాదిరాళ్ళు దర్శకుడికి అందిన చిరు ఆర్ధిక సాయం

వేయి కిలో మీటర్ల పాదయాత్ర కైనా ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి. అలాగే కొణిదెల వీర వెంకట శివ ప్రసాద్ అనే బడే యువకుడు ఈరోజు మెగా స్టార్ చిరంజీవిగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శం. తెలుగులో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజుల తర్వాత స్వయంకృషితో హీరోగా ఎదిగి టాలీవుడ్లో ఆయనకంటూ ఒక పేజీ క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. చిరంజీవి నటుడిగా కెరీర్ ప్రారంభమైంది పునాది రాళ్లు సినిమాతోనే. అయితే చిరంజీవికి నటుడిగా ‘పునాదిరాళ్లు’ సినిమాతో అవకాశం ఇచ్చిన దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ మంచాన పడ్డాడు అనే విషయాన్ని నిన్న మీడియా హైలైట్ చేసింది, దీంతో ఆయనకు సినీ వర్గాల నుంచి 66 వేల రూపాయల ఆర్థిక సాయం అందింది.
అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడమే కాక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న వార్త బయటకు రావడంతో ప్రసాద్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్టనర్ సురేష్ రెడ్డి తార్నాకలో ఉన్న దర్శకుడి ఇంటికి స్వయంగా వెళ్లి రూ.41 వేలు అందించారు. అలాగే 'మనం సైతం' అనే స్వచ్చంద సేవా సంస్థ నడుపుతున్న నటుడు నటుడు కాదంబరి కిరణ్ కుమార్ కూడా ఆ సంస్థ ద్వారా రూ.25 వేలు అందించారు. రాజ్ కుమార్ పరిస్థితి చూసిన కిరణ్ మనం కూడా సాయం చేద్దామని ఆ సంస్థ వాట్సాప్ గ్రూపులో పెట్టిన మెసేజ్ కి పలువురు ఔత్సాహిక నటులు, సినీ జర్నలిస్టులు స్పందించారు. వారందించిన మొత్తాన్ని కిరణ్ స్వయంగా వెళ్లి రాజ్‌కుమార్‌కు అందించారు. ఇక చిరంజీవి స్పందించాల్సి ఉంది.