English   

విడుదలకి ముందే వివాదాల సుడిగుండంలో.... జార్జి రెడ్డి ....

George Reddy.jpg
2019-11-19 08:16:34

జార్జి రెడ్డి..! ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్‌ లీడర్‌ నేపథ్యంలో వస్తున్న సినిమా. రిలీజ్‌కు ముందే ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. సినిమాను అడ్డుకుంటామని ఓ వర్గం.. సినిమాను సూపర్‌ హిట్‌ చేస్తామని మరో వర్గం మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఈ నెల 22న జార్జిరెడ్డి సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే విడుదలకు ముందే వివాదం మొదలైంది.

జార్జిరెడ్డి లెఫ్టిస్ట్ కావడంతో ఏబీవీపీ నేతలు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నెల 17న ప్రీరిలీజ్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించాలని భావించిన సినిమా యూనిట్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈవెంట్ ఏర్పాటు చేసి పవన్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించింది. అయితే పరిస్థితి అదుపు తప్పుతుందని ముందే ఊహించిన పోలీసులు ఫంక్షన్ కు అనుమతి ఇవ్వలేదు. 

జార్జిరెడ్డిపై కూడా దాదాపు 15 క్రిమినల్ కేసులున్నాయని, ఆయన రౌడీయిజాన్ని కూడా చూపించాలంటూ ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఏక పక్షంగా ఏబీవీపీ విద్యార్థులనే టార్గెట్ చేసి లేనివి ఉన్నట్లు చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు జార్జిరెడ్డి హీరో అంటోంది పీడీఎస్యూ. పేద విద్యార్థుల తరపున పోరాడిన జార్జిరెడ్డి కథతో తీసిన సినిమాను అడ్డుకుంటే సహించేది లేదని చెబుతోంది.

జార్జ్ రెడ్డి చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా విద్యార్థుల దృష్టిలో హీరోగానే ఉన్నాడని జార్జ్ రెడ్డి విద్యార్థులు , రైతుల పక్షాన పోరాడాడని చెబుతోంది. కానీ జార్జిరెడ్డి హత్య కేసులో ఏబీవీపీ విద్యార్థుల హస్తం లేదని కోర్టు గతంలోనే తీర్పునిచ్చిందనే విషయాన్ని ఏబీవీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే వాస్తవ ఘటనలు ఆధారంగా సినిమా తీశామని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక సినిమా రిలీజ్ కి ఇంకా మూడు రోజులే ఉండడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో ఉంది.

More Related Stories