క్లాసీ డైరెక్టర్ తో స్వీటీ సినిమా

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన అనుష్క చివరిగా భాగమతి సినిమా చేసి రెస్ట్ తీసుకుంటోంది. ఆమె ఎట్టకేలకి ఒక సినిమా మొదలుపెట్టింది. ఈ మధ్యలో చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో ఝాన్సీరాణిగా మెరిసి తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఇందులో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. దీంతో అనుష్క నెక్ట్స్ చిత్రం ఏమిటన్న ప్రశ్న సినీ అభిమానుల మెదళ్లలో తొలుస్తోంది. అనుష్క కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నటించనున్నారట. కథ మొత్తం మహిళా ప్రధానంగా నడుస్తుందని టాక్.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రచయిత గోవింద్ నిహ్లాని రాసిన ఒక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ఆమెతో పాటు తమిళ బిగ్‌బాస్ ఫేం అభిరామి వెంకటాచలం కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే సినిమా యూనిట్ లేదా మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నిజానికి గౌతమ్ మీనన్ దర్శకుడిగా చేసిన చిత్రాలే తెరపైకి వచ్చి చాలా కాలమైంది, అయితే ధ్రువనక్షత్రం, ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రాలు చాలా కాలంగా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ధనుష్ మేఘాఆకాశ్ జంటగా నటించిన ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రం విడుదల తేదీలు రెండు మూడు సార్లు వాయిదా పడ్డా, ఈ సారి రిలీజ్ కి మాత్రం రెడీ అయింది.