లావణ్య త్రిపాఠికి ఇప్పుడు ఇంక చావో రేవో..

ఎంత పెద్ద మెడిసిన్ కు అయినా ఎక్స్ పైరీ ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో కూడా అంతే. ఎంతటి క్రేజీ హీరోయిన్ కు అయినా కూడా కచ్చితంగా ఎక్స్ పైరీ ఉంటుంది. ఏదో ఓ రోజు ఆమెకు కూడా అవకాశాలు తగ్గిపోతాయి. ఇక్కడ వైకుంఠపాళి ఆట నడుస్తుంటుందంతే. ఆట తెలిసి పాము అనే ఫ్లాప్ నోట్లో పడకుండా హిట్ అనే నిచ్చెన ఎక్కుతూ వెళ్లిపోవాలి. ఒక్కసారి పాము నోట్లో పడితే కిందకి జారిపోవాల్సిందే. ఈ ఆట తెలియకే చాలా ఏళ్లుగా ఇబ్బంది పడుతుంది లావణ్య త్రిపాఠి. అప్పుడప్పుడూ నిచ్చెనలు ఎక్కుతుంది కానీ ఎక్కిన నిచ్చెనల కంటే పాము నోట్లోనే ఎక్కువగా పడుతుంటుంది ఈ భామ.
ఇప్పుడు మరీ దారుణంగా ఆట మొదట్లోనే ఉంది లావణ్య త్రిపాఠి. పాములు ఎన్నో సార్లు కాటేసిన తర్వాత ఇప్పుడు చివరగా ఒక్క నిచ్చెన ఎక్కాలని చూస్తుంది. ఆ నిచ్చెన పేరు అర్జున్ సురవరం. నిఖిల్ సాయంతో మరోసారి ఇండస్ట్రీలో నిలబడాలని చూస్తుంది ఈ భామ. ఇక్కడ విచిత్రం ఏంటంటే నిఖిల్ కూడా అచ్చంగా లావణ్య పొజిషన్ లోనే ఉన్నాడు. ఈయన కూడా పాము నోట్లో పడి పడి చివరికి నిచ్చెన కోసం ట్రై చేస్తున్నాడు. ఈ ఇద్దరికి అర్జున్ సురవరం కీలకంగా మారింది. ఏడాది తర్వాత విడుదలవుతున్న సినిమా ఇది. నవంబర్ 29న రానుంది అర్జున్ సురవరం. ఇందులో నకిలీ సర్టిఫికేట్ల భాగోతం బయటపెట్టే రిపోర్టర్ గా నటించాడు నిఖిల్. లావణ్య కూడా జర్నలిస్టే. చూడాలిక.. లావణ్య కెరీర్ ను నిఖిల్ ఏం చేస్తాడో..?