తెరపైకి ఉదయ్ కిరణ్ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా..

అవును.. మీరు చూస్తున్నది నిజమే. త్వరలోనే ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతుంది. ఇప్పటికే రెండు మూడు సార్లు ఈయన బయోపిక్ పై చర్చ జరిగింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అప్పట్లో దర్శకుడు తేజ కాబోయే అల్లుడు అంటూ ఉదయ్ కిరణ్ బయోపిక్ అనౌన్స్ చేసాడు కానీ ఎందుకో మళ్ళి కొన్ని కారణాల వల్ల సినిమాను ఆపేసాడు. అయితే ఇప్పుడు ఓ కొత్త దర్శకుడు మరోసారి ఉదయ్ బయోపిక్ పై ఫోకస్ చేసాడు. 2014లో ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత అంతా ఈ కుర్ర హీరోను మరిచిపోయారు. కానీ ఇప్పుడు ఓ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు గుర్తు చేస్తున్నాడు. కొన్ని లఘు చిత్రాలు చేసిన అనుభవం ఉన్న ఆ దర్శకుడు.. ఓ భారీ ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి ఉదయ్ బయోపిక్ చేస్తున్నాడు. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండటం విశేషం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ ని తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. ఆ తర్వాత నువ్వునేనుతో స్టార్ గా మార్చాడు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నీ స్నేహం లాంటి సినిమాలు ఉదయ్ ను సూపర్ స్టార్ గా మార్చేసాయి. అయితే ఆ తర్వాత ఉదయ్ జీవితంలో అనుకోని కుదుపు చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థం అయి క్యాన్సిల్ అవ్వడం. ఆ తర్వాతే ఆయన కెరీర్ గాడి తప్పిందంటారు అంతా. ఓ రకంగా ఉదయ్ కెరీర్ నాశనం కావడానికి సొంత తప్పిదాలు ఎన్ని ఉన్నాయో.. చిరు కూడా అంతే కారణం అంటారు. ఆ కథంతా ఇప్పుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ లో చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. బయోపిక్ చేయాల్సినంత గొప్పసంఘటనలు ఉదయ్ జీవితంలో ఏం జరగలేదు. కానీ చేస్తానంటున్నాడంటే కేవలం కాంట్రవర్సీ కోసమే కదా..! మరి ఉదయ్ జీవితాన్ని తెరపై చూపించాలంటే మధ్యలో చిరుతో పాటు పవన్, అల్లు అరవింద్ పాత్రలు కూడా చూపించాలి. మరి అవన్నీ చూపిస్తాడో లేదో చూడాలిక..!