English   

బాలకృష్ణతో రోజా.. బ్లాస్టింగ్ కాంబినేషన్ సెట్ చేస్తున్న బోయపాటి..

Balakrishna Roja.jpg
2019-11-27 08:17:15

బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూలర్ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్నాడు. అందుకే రియూనియన్ పార్టీకి కూడా రాలేకపోయాడు. విడుదలకు మరో 25 రోజులు మాత్రమే ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ అయిపోయాడు నందమూరి వారసుడు.

ఇదిలా ఉంటే ఈయన తర్వాత సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాడు. దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయిస్తున్నారు రవీందర్ రెడ్డి. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బోయపాటి శ్రీను. సింహా, లెజెండ్ లాంటి సినిమాల తర్వాత బోయపాటితో చేస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ సినిమాలో వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు బాలయ్య కోసం మళ్లీ మేకప్ చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ కాంబినేషన్ లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.

90వ దశకంలో భైరవ ద్వీపం, మాతో పెట్టుకోకు, గాండీవం, పెద్దన్నయ్య, బొబ్బిలి సింహం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, సుల్తాన్ లాంటి సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత బాలకృష్ణ రోజా కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై కలిపే ప్రయత్నం చేస్తున్నాడు బోయపాటి శ్రీను. పైగా ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. రోజా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా బుల్లితెరకు దగ్గరగానే ఉంది. జబర్దస్త్ కామెడీ షోతో పాటు బతుకుజట్కబండి ఇలాంటి సీరియస్ షోస్ కూడా చేస్తుంది ఈమె.

ఒకవేళ అన్నీ కుదిరి రోజా బాలయ్య కాంబినేషన్ సెట్ అయితే సినిమాకి చాలా ప్లస్ కానుంది. జనవరి నుంచి బోయపాటి బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

More Related Stories