అర్జున్ సురవరం మూవీ రివ్యూ

హ్యాపీ డేస్ సినిమాతో నటుడిగా నిలదొక్కుకున్న నిఖిల్ తాజాగా నటించిన సినిమా అర్జున్ సురవరం. తమిళ సూపర్‌హిట్ ‘కణితన్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ చివరగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ జర్నలిస్ట్‌గా నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు సినిమా మీద ఆసక్తి కలిగించాయి. మరి ఆ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం.
కథ:
అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్)కి జర్నలిజం అంటే మక్కువ ఎక్కువ. అందుకే చెబితే వద్దంటాడని తండ్రికి కూడా చెప్పకుండా సాప్ట్వేర్ ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసి జర్నలిజంపై మక్కువతో ఓ టీవీ చానెల్లో రిపోర్టర్‌గా చేరుతాడు. ఏనాటికి అయినా బీబీసీలో పనిచేయాలన్న కల కోసం ఒక సందర్భంలో కావ్య (లావణ్య త్రిపాఠి)కు అబద్ధం చెప్తాడు. ఇద్దరూ ప్రేమలో కూడా పడతారు, ఎట్టకేలకి అర్జున్‌కు బీబీసీలో ఉద్యోగం కూడా వస్తుంది. కావ్యకు అర్జున్ ఐ లవ్యూ చెప్పే సమయానికి పోలీసులు వచ్చి అర్జున్ ని అరెస్టు చేస్తారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి అర్జున్‌తో పాటు మరికొందరు ఎడ్యుకేషన్ లోన్స్ పేరిట బ్యాంకులకు పెద్దమొత్తంలో టోకరా వేసినట్టు పోలీసులు పేర్కొంటారు. అందుకు కారణం నకిలీ సర్టిఫికెట్ల తయారీ అనే విషయం తెలుస్తుంది. ఎలాగైనా ఆ చీకటి కోణాన్ని బయట పెట్టేందుకు అర్జున్ నడుం బిగిస్తాడు. స్వతహాగా పాత్రికేయుడైన అర్జున్ తనకున్న తెలివితేటలతో సర్టిఫికెట్ల మాఫియా బండారాన్ని ఎలా బయట పెట్టాడనేదే సినిమా.
కథనం :
తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో తమిళ రీమేక్ అనే ఫీల్ రాకుండా తెలుగు నేటివిటీతో అర్జున్ సురవరంను తెరకెక్కించడంలో మాతృక దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ మొదటి అర్ధభాగం ఇంట్రస్టింగ్ స్టఫ్ తో వరుస ట్విస్టులతో దర్శకుడు వేగంగా నడిపాడు. సెకండాఫ్‌లోనే కథ కొంచెం నెమ్మదించింది. కొన్ని సీన్లలో ఫైట్లు, ఛేజింగ్‌లతో అక్కడక్కడ ఓవర్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. కానిస్టేబుల్ సుబ్బారావు(పోసాని) చనిపోయిన సీన్లో అతని కొడుకు (వెన్నెల కిషోర్) ఎమోషన్స్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ నిజాయితీ గురించి చెప్పే సీన్లు బాగా కుదిరాయి.
నటీనటులు :
ఈ సినిమాతో నిఖిల్ మరోసారి తన ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి చివరి వరకు నిఖిల్ వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర క్లైమాక్స్ వరకు ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం లేదు. స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్ హాస్యాన్ని పంచాడు. విలన్ పాత్రలో తరుణ్ అరోరా ఆకట్టుకోగా, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటులు తమ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.పాటలు అంతంతమాత్రం ఉండగా నేపథ్య సంగీతం చాలావరకు అర్ధం పర్ధం లేని శబ్దాలతో సంబంధం లేనట్టు అనిపించింది. సినిమాటోగ్రఫీ పర్లేదు, ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఫైనల్ గా : అర్జున్ సురవరం వెయిటింగ్ కి తగ్గ ఫలితం లభించినట్టే !
రేటింగ్: 2.5 /5.