ప్రియాంక హత్య కేసు....విచారం వ్యక్తం చేస్తోన్న టాలీవుడ్

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు పెను సంచలనంగా మారింది. దేశమంతటా ఈ హత్య మీద విస్తృత చర్చ జరుగుతోంది. ఈ విషాద సంఘటన అందరినీ కలచివేస్తుంది. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు ప్రముఖులు దీనిపై తమ వాణి వినిపిస్తున్నారు. ప్రియాంక హత్యపై సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అత్యంత కిరాతకమైన చర్యగా పేర్కొన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. హీరోలు అల్లరి నరేష్, సుధీర్‌బాబు, అల్లు శిరీష్, హీరోయిన్లు అనుష్క, లావణ్య త్రిపాఠి, కీర్తి సురేష్, డైరెక్టర్ వీ.వీ. వినాయక్‌తో పాటు ప్రముఖ యాక్టర్ పూనమ్ కౌర్, యాంకర్ శ్రీముఖి, రాంచరణ్ భార్య కొణిదెల ఉపాసనలు ట్విట్టర్ ద్వారా ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆడపిల్లలు ఆపద సమయంలో ఉన్నప్పుడు పోలీసులు లేదా షీ టీమ్స్‌ని సంప్రదించండి.
మీ పరిసరాలలో ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో ఏదైన తేడా అనిపిస్తే వెంటనే అక్కడి నుండి వెళ్లిపోండని చెబుతున్నారు పోలీసులు. ఇక ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా మండిపడింది ప్రముఖ యాక్టర్ పూనమ్ కౌర్. మరో రెండు, మూడు రోజులు ఈ కేసుపై హైప్ తీసుకొస్తారని.. ఆ తర్వాత అందరూ మర్చిపోతారని, మీరు ఏమీ చేయలేకపోతే.. నేనే వాళ్లు చంపి జైలుకెళ్తానని వీడియోలో ఫైర్ అయింది పూనమ్. ఈ ఘటనపై అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేసింది. ప్రియాంక మీద జరిగిన దాడి అత్యంత విషాదకరమైన ఘటన అని, ఈ ఘటన మానవత్వాన్ని మంట కలిపేలా ఉందని పేర్కొంది. ఇలాంటి దారుణానికి పాల్పడిన నేరస్థులను జంతువులతో పోల్చినా జంతువులే సిగ్గుపడతాయని అంది. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..ఆమె కుటుంబసభ్యుకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు పోస్ట్ పెట్టింది.