English   

హ్యాపీ బర్త్ డే రాశి ఖన్నా.. మంచి రోజులు వచ్చినట్లేనా..

 Raashi Khanna
2019-11-30 11:06:51

రాశీఖ‌న్నా.. ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో చాలా సినిమాలు చేసింది.. ఇక్క‌డ విజ‌యాలు కూడా అందుకుంది. కానీ ఇప్పుడు లేవు క‌దా.. అందుకే మ‌నోళ్లు పెద్దగా ప‌ట్టించుకోవ‌డం మానేసారు. శ్రీ‌నివాస క‌ళ్యాణం ఫ్లాప్ త‌ర్వాత అమ్మ‌డు తెలుగులో అరకొర అవకాశాలే వస్తున్నాయి. ప్ర‌స్తుతం త‌మిళ్ ఇండ‌స్ట్రీపై దృష్టి పెట్టింది రాశీఖ‌న్నా. రెండేళ్ల కింది వ‌ర‌కు తెలుగు త‌ప్ప మ‌రో భాష‌లో సినిమాలే చేయ‌ని రాశీఖ‌న్నా.. ఇప్పుడు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌పై కూడా ఫోక‌స్ పెట్టింది. విల‌న్ సినిమాతో కేర‌ళ‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్క‌డ తొలి సినిమాతోనే షాక్ తినేసింది. దాంతో ఇప్పుడు త‌మిళ్ ఇండ‌స్ట్రీపై ఫోకస్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ ఇప్పుడు జ‌యంర‌వి హీరోగా సుభాష్ సినిమాలో నటించింది రాశీఖ‌న్నా. ఈ మధ్య విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన తమిళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది రాశి. ఇది తెలుగులో కూడా అనువాదం అయింది కానీ పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌నిపించ‌ లేదు. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో న‌టించే అవ‌కాశం అందుకుంది రాశీఖ‌న్నా. క్రాంతిమాధ‌వ్ దీనికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాతో పాటు సాయి తేజ్ ప్రతిరోజూ పండగే సినిమాలోనూ రాశీ హీరోయిన్. స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తారేమో అనుకుంటే అస్సలు వర్కవుట్ కావడం లేదు. అందుకే చిన్న హీరోలు.. వచ్చిన అవకాశాలతోనే సరిపెట్టుకుంటుంది రాశీ ఖన్నా. అయితే ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ అని గిరి గీసుకుని కూర్చున్న రాశీఖ‌న్నా.. ఇప్పుడు మాత్రం తెగిన గాలిప‌టంలా అన్ని ఇండ‌స్ట్రీలు చుట్టేస్తుంది. నవంబర్ 30 ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. దాంతో అభిమానులు ప్రేక్షకులు ఈ పాలరాతి శిల్పానికి బర్త్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు.

More Related Stories