ఆడవాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు...చిక్కుల్లో డైరెక్టర్ !

తమిళ సినిమా మాజీ డైరెక్టర్, నటుడు కే భాగ్యరాజా కరుతుకలై పతివు సై సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆడవాళ్లు చెడిపోవడానికి సెల్ఫోన్లు కారణమని, కట్టుబాట్లు వదిలేస్తున్నారని భాగ్యరాజా వ్యాఖ్యానించారు. మహిళలు చనువు ఇవ్వడం వల్లే పురుషులు తప్పు చేస్తున్నారని భాగ్యరాజా విమర్శలు చేశారు. వివాహేతర సంబంధం కోసం భర్త, పిల్లల్ని మహిళలు చంపేస్తున్నారని అన్నారు. అక్కడితో ఆగక పొలాచ్చి రేప్ విషయంలో మగాళ్లది తప్పులేదని, అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టే రేప్ జరిగిందని భాగ్యరాజా వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
భాగ్యరాజాపై మహిళలు, మహిళా సంఘాలు తీవ్రంగా ఆయన మీద దుమ్మెత్తి పోశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. భాగ్యరాజాపై కఠిన శిక్షలు విధించాలని తమిళనాడు ఉమెన్ కమీషన్ కి లేఖ రాసింది. దీనిపై స్పందించిన కమీషన్ చైర్పర్సన్ కన్నగి ప్యాకియానాథన్ డిసెంబర్ 2 న తన ముందు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కూడా వారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.