తమన్ దూకుడు.. వరస సినిమాలతో రచ్చ చేస్తున్న సంగీత దర్శకుడు..

తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.. ఇన్నాళ్లు ఈ ప్రశ్నకు సమాధానం దేవి శ్రీ ప్రసాద్ అని వచ్చేది. కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ డిఎస్పి జోరు తగ్గించాడు. దాంతో ఇదే అదునుగా దూసుకుపోతున్నాడు తమన్. విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు తమన్ సంగీతం అందించినవే. గత రెండేళ్లుగా మహానుభావుడు, తొలిప్రేమ, ఛల్ మోహన్‌రంగ, అరవింద సమేత వీర రాఘవ సినిమాలు తనకు మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పుకొచ్చాడు సంగీత దర్శకుడు తమన్.
సరైనోడు తర్వాత ఏడాది విరామం తీసుకున్నానని.. ఆది తనకెంతగానో ఉపయోగపడిందని చెబుతున్నాడు ఈయన. ఆ సమయంలోనే ఇలాంటి సినిమాలు ఒప్పుకోవాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు తమన్. ఇక ఇప్పుడు డిసెంబర్ 13న విడుదల కానున్న వెంకీ మామతో పాటు డిసెంబర్ 20న విడుదల అవుతున్న ప్రతి రోజు పండగే.. 25న రానున్న డిస్కో రాజా సినిమాలకు తమన్ సంగీతం అందించాడు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలవుతున్న అల వైకుంఠపురంలో సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వీటితో పాటు తమన్ చేతిలో మరో అరడజను ప్రాజెక్టులున్నాయి.
ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నాడు. తన జోరు చూస్తుంటే ఏడాదికి 15 సినిమాలకు సంగీతం అందించేలా కనిపిస్తున్నాడు. ఇక తన కెరీర్లో రీమిక్స్ సాంగ్స్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు తమన్. నాయక్‌లో 'శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో...'.. ఇంటిలిజెంట్‌లో 'ఛమక్ ఛమక్ ఛామ్'తో పాటు తమన్ కొన్ని రీమిక్స్ చేశారు. అయితే ఒకసారి ఒక రీమిక్స్ సాంగ్ విషయంలో సీనియర్ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తనకు ఫోన్ చేసి తిట్టారని.. అప్పట్నుంచి రీమిక్స్ సాంగ్స్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తనకు 60 ఏళ్లు వచ్చాక... తన పాటలను ఎవరైనా రీమిక్స్ చేస్తే అప్పుడు తాను కూడా నా పాటలు పాడు చేసాడు అంటూ తిట్టుకుంటానని అందుకే ఇప్పుడు రీమిక్స్ పాటలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు తమన్.