జయలలిత బయోపిక్ లో శోభన్ బాబు దొరికాడు..

ఇప్పుడు తెలుగులోనే కాదు దేశంలోని అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్స్ హవా బాగా నడుస్తోంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన లెజెండ్స్ జీవితాలను ఇప్పుడు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి కొత్తగా కథ కూడా రాయాల్సిన అవసరం ఉండదు. ఉన్న కథను కాస్త మార్చి చెబితే సరిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్, సావిత్రి బయోపిక్స్ వచ్చాయి. ఇందులో ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయ్యింది. సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తమిళనాట కూడా ఒక భారీ బయోపిక్ సిద్ధమవుతుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి దివంగత నేత జయలలిత బయోపిక్ అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. అమలాపాల్ మాజీ భర్త ఏఎల్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కంగన రనౌత్ హీరోయిన్.
ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి తమిళనాట జయలలిత బయోపిక్ తలైవి సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమా కోసం భారీ టెక్నికల్ టీం పనిచేస్తుంది. జి.వి.ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం అందిస్తుండగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. 100 కోట్లతో జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు ఏ ఎల్ విజయ్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. అన్ని ఇండస్ట్రీల్లో వర్కవుట్ అవుతుందని భావిస్తున్నాడు విజయ్. ఇక జయలలిత బయోపిక్ అంటే ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. అందులో మొదటి వ్యక్తి ఎంజిఆర్. ఈ పాత్రను అరవిందస్వామి పోషిస్తున్నాడు. కరుణానిధి పాత్ర కోసం సరైన నటున్ని ఎంపిక చేసే పనిలో పడ్డాడు విజయ్. ఇక మూడో పాత్ర శోభన్ బాబు. అమ్మ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు సోగ్గాడు. ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ఇప్పటికే జయలలిత కుటుంబ సభ్యుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు దర్శకుడు. మొత్తానికి మరి జయలలిత బయోపిక్ ఎలా ఉండబోతుందో చూడాలి. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.