మా తమ్ముడు అన్నదేంటి.. మీరు రాస్తున్నదేంటి.. నాగబాబు ఫైర్..

దిశ నిందితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసేవాళ్లను నడిరోడ్డుపై చంపేసిన పాపం లేదు అంటూనే అసలు అంత దూరం తీసుకెళ్లకుండా రెండు బెత్తం దెబ్బలు వేస్తే అన్నీ సరిపోతాయ్ అంటూ మరో వ్యాఖ్య కూడా చేశాడు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మాత్రం పూర్తిగా సోషల్ మీడియాలో వక్రీకరణకు లోనయ్యాయి అని నాగబాబు చెబుతున్నాడు.
పవన్ కళ్యాణ్ చెప్పినది ఒకటైతే సోషల్ మీడియాతో పాటు సాక్షి లాంటి మీడియా సంస్థలు మరోలా ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డాడు. అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసే వాళ్ళని చంపేయడంలో ఎలాంటి తప్పు లేదని.. మీకు మాత్రమే కాదు మాకు కూడా మానవత్వం ఉంది అంటున్నాడు మెగాబ్రదర్. కానీ పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటైతే మీడియా అంతా కలిసి రాస్తున్నది మరొకటి అంటూ ఆయన మండిపడ్డాడు.
దుబాయ్ లాంటి దేశాల్లో చిన్నప్పటినుంచే క్రమశిక్షణతో పిల్లలు పెంచుతారని.. అక్కడ ఏదైనా తప్పు చేస్తే తోలు ఊడేలా బెత్తంతో రెండు దెబ్బలు వేస్తారని.. ఇక్కడ కూడా అంత దూరం తీసుకెళ్లకుండా చిన్నప్పుడే పిల్లలను క్రమశిక్షణతో పెంచితే పెద్దయ్యాక వాళ్ళ బుర్రలో ఇలాంటి చెడు ఆలోచనలు రావు కదా.. దాన్ని బెత్తం దెబ్బలతో అక్కడే ఆపేస్తే మంచిది అంటూ పవన్ కళ్యాణ్ చెబితే.. దాన్ని ఇప్పటి దిశా నిందితులకు అనునయించి దారుణంగా వక్రీకరించారు అంటూ నాగబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.
చేతిలో మీడియా ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రజలకు తప్పుడు వార్తలు అందిస్తారా అంటూ ఆయన నిలదీశాడు. సమాజంపై బాధ్యత మీకు మాత్రమే ఉంటుందా మాకు ఉండదా.. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలని మేము మాత్రం కోరుకోమా అంటూ మీడియా సంస్థలపై ఆయన ధ్వజమెత్తారు.
ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కూడా తప్పుగా చూపించే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయంటూ సాక్షిని ఆయన ఉదాహరణగా చూపించాడు. ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులతో పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో యుద్ధం చేస్తున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. అందుకే సాక్షిలో ఇలా పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్నాడు నాగబాబు.